మహిళలు మెచ్చిన అలనాటి కథానాయకుడు. ఆరడుగుల పొడవు...అందమైన ముఖ వర్చస్సు...గంభీరమైన వాచికం వెరసి విభిన్న పాత్రల కలబోత. విలక్షణమైన నటనతోపాటు భావుకతనూ కలిగిన వ్యక్తి. సామాజిక ఇతివృత్తాలపై తన స్పందనలను కవిత్వంలో ఇనుమడింపచేసుకున్న కవి రంగనాథ్. తన నలభై ఏళ్ల సినీ జీవితపు ప్రయాణంలోని మజిలీలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నా నలభై ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కున్నాను. మరెన్నో ఎత్తు పల్లాలను చూశాను. ఒకనాడు చలనచిత్ర పరిశ్రమ మొత్తం నన్ను హీరో అని భుజానికెత్తుకుంది. ఆనాడు అందలమెక్కింది లేదు. తర్వాత కథానాయకుడిగా అస్సలు అవకాశాలు రాలేదు. ఆ రోజు పాతాళానికి పోయింది లేదు. ఒక్క సినిమాలోనైనా నటుడిగా గుర్తింపు పొందితే చాలు అని మాత్రమే అనుకున్న నేను...సుమారు 300 చిత్రాలకు పైగా నటించాను. 50 చిత్రాల్లో హీరోగా చేసాను. 50 చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలనూ పోషించాను. ఇక విభిన్నమైన పాత్రలు, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా నేటి వరకూ నా నటనా జీవితం కొనసాగుతూనే ఉంది. ఇన్నేళ్ల నా సినీ జీవితంలో శత్రువులంటూ ఎవరూ లేరు. అందరూ మిత్రులే. ఆ తృప్తి చాలు అవార్డులు దక్కలేదనో.. రావాల్సిన పేరు రాలేదనో అనుకోటానికి వీల్లేకుండా. అమ్మ కోరిక నేను మంచి నటుడుగా పేరు తెచ్చుకోవలన్నది అమ్మ కోరిక. మాది సామాన్య మధ్య తరగతి కుటుంబం. నాకు నలుగురు తమ్ముళ్లు. ఒక్కగానొక్క చెల్లెలు. మా అమ్మమ్మ, తాతయ్యలకు మగపిల్లలు లేకపోవడంతో నా బాల్యం అంతా వారి దగ్గరే గడిచింది. మా తాతయ్య మందసా మహరాజుల ఎస్టేట్‌లో డాక్టర్‌గా పనిచేసేవారు. మా ఇంట్లోవారంతా శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన వారు. మా అమ్మమ్మ చాలా బాగా పాడుతుంది. మా అమ్మ కూడా. నిజానికి మా అమ్మ సినిమాల్లో పాడాలని ప్రయత్నించింది. కానీ చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతల వల్ల ఆమె ఆశ తీరలేదు. తాతయ్య తన దగ్గరకొచ్చే పేద రోగుల గురించి, వారి కష్టాలు, రాజుగారు చేసే మంచి పనులు, దాన ధర్మాల గురించి నాకు కథలుగా చెప్పేవారు. వాటి ప్రభావం నాపై చాలానే ఉంది. ఎనిమిదో ఏటే నేను ముఖానికి రంగేసుకుని నాటక ప్రదర్శన ఇచ్చాను. అప్పుడే నా మనస్సులో మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలనే కోరిక పుట్టింది. అందుకోసం నా శరీరాన్ని నిరంతరం కాపాడుకోవడం, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం చేసేవాడిని. దీపావళి టపాసులు కూడా కాల్చేవాడ్ని కాదు. అవి ప్రమాదవశాత్తు నా పై పడి గాయాలైతే హీరోగా పనికిరాననే భయంతో. ఇక ఇండిస్టీలో గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేరు నాన్న రిటైర్ అవ్వడం, కుటుంబ బాధ్యతలు పంచుకోవాల్సి రావడంతో సినిమా జీవితం అన్నది గ్యారెంటీ లేని బతుకు. లైఫ్‌లో సెటిలవ్వాలి అనే నిశ్చయానికొచ్చాను. ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాను. బి.ఎ చదువుతుండగానే దక్షిణ మధ్య రైల్వేలో టిక్కెట్టు కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. నెలకు రెండు వందల రూపాయల జీతం. వెంటనే చైతన్యతో పెళ్లి. మూడేళ్లు తిరగకుండా ముగ్గరు పిల్లలు. అలా సాగిపోతుండేది జీవితం. కానీ మనస్సులో మాత్రం నటుడవ్వాలన్న కోరిక అప్పుడప్పుడు తట్టిలేపుతుండేది. కొంత మంది మిత్రులం కలిసి 'వీణాపాణి' అనే నాటక సంస్థ ప్రారంభించాం. చాలా నాటకాలు రాసి, దర్శకత్వం వహించేవాడ్ని. రాజమండ్రిలో 'బుద్ధిమంతుడు' చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఒక పాట చిత్రీకరణ కోసం లోకల్‌గా కొంత మంది నటుల కోసం వెదుకుతున్నారు దర్శకుడు బాపుగారు. మా నాటక సమాజంలో సంగీత బృందం వారికి ఆ అవకాశం వచ్చింది. వారు నన్నూ రమ్మన్నారు. అలా మొదటి సారి 1969లో టాటా గుడ్ బారు అనే పాటలో ఫ్లూటు వాయిస్తూ మొదటిసారి వెండి తెరపై కనిపించాను. చాలా సినిమాలు వదులుకున్నా దర్శకుడు బాపు 'అందాల రాముడు' సినిమాలో స్థల పురాణం సన్నివేశంలో 'రాముడి వేషం ఉంది చేస్తావా?' అని అడిగారు. అదే సమయంలో చిత్రకల్పన వారి బ్యానర్లో హీరోగా అవకాశం వచ్చింది. ఇదే విషయం ఆయనకు చెప్పాను. హీరోగా పరిచయం చేస్తానంటే కాదనటం ఎందుకు, ఆ సినిమా ఒప్పుకోమని సలహా ఇచ్చారు ఆయన. అలా 'చందన' సినిమాతో తెలుగు చిత్ర సీమకు కథానాయకుడిగా పరిచయమయ్యా. ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించి పెట్టింది మాత్రం 'పంతులమ్మ'. వాస్తవానికి నేను నటించిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్. అవే నాకు మహిళాభిమానుల్ని సంపాదించి పెట్టింది. నన్ను చూస్తే తమ ఇంట్లో వ్యక్తిలా అనిపిస్తానని నేటికీ జనం అంటుంటారు . అందుకే సెంటిమెంట్ సీన్స్, కుటుంబ సంబంధాల సన్నివేశాలు పండించే పాత్రలకు చిరునామా రంగనాథ్ అంటారు. చాలా మంది. కానీ అది నా అదృష్టంగా భావిస్తాను. అవకాశం వచ్చిన ప్రతి సినిమా చేయలేదు. డబ్బు సంపాదించడం నా ధ్యేయం కాదు. నటనపై మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టానన్న సంగతి ఏనాడూ మరవలేదు. కథ, నా పాత్ర తీరు, దర్శకుడు, నిర్మాతల నిబద్దత, వృత్తి బాధ్యత ఇవే సినిమా ఒప్పుకునే ముందు నేను చూసే విషయాలు. అందుకోసం చాలా సినిమాలు వదులుకున్నాను. హీరోగా రాణిస్తున్న సమయంలో ఏరియా డిస్ట్రిబ్యూషన్ అప్పుడప్పుడే చిత్ర సీమకు పరిచయమైంది. దాంతో అవకాశాలు సన్నగిల్లాయి. పరిస్థితి తారుమారైంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరిగాయి. విలన్‌గా ఎందుకు చేయకూడదు అనిపించింది. హీరో కృష్ణం రాజుని సలహా అడిగాను. ఎందుకు చేయకూడదు. నిజానికి హిరో కన్నా విలన్ పాత్రలు చేసేవారే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు అని చెప్పారు. అలా ఆయన నాకు 'గువ్వల జంట' సినిమాలో ప్రతినాయకుడి పాత్ర ఇచ్చారు. తమ్ముళ్ల చదువు, మంచంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్య బాధ్యత అవన్నీ నేను హీరోగానైతేనే సినిమా చేస్తాననే అవకాశం ఇవ్వలేదు. ఎలాంటి పాత్రలైనా చేయాలి అనుకున్నా. అలానే వచ్చిన పాత్రలు చేసుకుంటూపోయా. నా కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చా. ఆ ఇద్దరిని అడిగాను 'ఖైదీ గారు' చిత్రం విడుదలైన తర్వాత ఓ రోజు రైల్లో రేపల్లె వెళుతున్నా. అప్పుడు చాలా మంది అభిమానులు నా దగ్గర కొచ్చి సార్ మీరంటే మాకు చాలా అభిమానం. ఖైదీగారు సినిమాలో మీ నటన చాలా బాగుంది. మీ పాత్రలు మాకు కన్నీరు తెప్పిస్తుంటాయి ఉక్కిరి బిక్కిరై వారంతా నాతో అంటుంటే క్యారక్టర్ ఆర్టిస్ట్గానైతేనేం విభిన్న పాత్రలు చేయాలనే దృఢ నిశ్చయం ఏర్పడింది. దాంతో ముత్యాల సుబ్బయ్య, కృష్ణా రెడ్డి గారిని నా జీవితంలో మొదటి సారి పాత్రలు ఇవ్వమని అడిగాను. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఎవ్వరినీ అడగలేదు. ఆ అవసరం రాలేదు. ఆ తర్వాత ఒక వాణిజ్య ప్రకటనలో నటించాను. అది నిజంగా నా రెండో ఇన్నింగ్స్‌కు చాలా ఉపకరించిందనే చెప్పాలి. అది చూసే ఈటీవీ 'భాగవతం' సీరియల్లో బాపుగారు కంసుడి పాత్ర, రాఘవేంద్ర రావు 'శాంతి నివాసం' ఇలా బుల్లి తెరలోనూ అవకాశాలు వచ్చి... ప్రేక్షకులకు నన్ను మరింత దగ్గర చేసాయి. తాతనయ్యాక ప్రేమలేఖ మాది ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లే. మా ఆవిడ చైతన్య తను ఆరోగ్యంగా ఉన్నంతకాలం అలుపెరగని గృహిణి అనే చెప్పాలి. నేను సినిమాల్లో తీరికలేకున్నా నేను నిర్వర్తించాల్సిన కుటుంబ బాధ్యతలన్నీ తనే నిర్వహించింది. అప్పుడప్పుడూ నేను కవిత్వం రాస్తుండేవాడిని. రాసి ఆమెకు చదివి వినిపిస్తే మూతి విరిచి బాగానే ఉంది అంటూ మెలికలు తిరిగేది. నాకోసం ఎప్పుడూ రాయరా అని సరదాగా అడిగేది. మా పెద్దమ్మాయి కుటుంబం బెంగళూరులో ఉంటుంది. ఆమె కాన్పు సమయంలో నెలరోజులు చైతన్య నాకు దూరంగా ఉండాల్సొచ్చింది. అప్పుడు అనిపించింది నా భార్యకు ప్రేమ లేఖ రాయాలని. అలా మా పెద్ద మనమరాలు పుట్టినప్పుడు నా భార్యకు మొదటి ప్రేమ లేఖ రాసా. ఎందుకు రాయాలనిపించిందో తెలియదు కానీ అలా రాయడం మాత్రం మా ఇద్దరి బంధానికి అదొక తీపిగుర్తు. తర్వాత కొన్నేళ్లకు బాల్కనీలో కాలు జారి పడి రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. 15 ఏళ్లు మంచంలోనే ఉంది. ఆమె నడిచి వెళ్లిన ఆఖరి వేడుక నటుడు నూతన్ ప్రసాదు గారింట్లోదే. ఆమె నాతో తరచూ అంటుండేది. నా మీద మీకు చాలా ప్రేమ. అందుకే నాకు మీరు సేవ చేస్తున్నారని. బాధ్యత ముఖ్యం. అదే ప్రేమను కలిగిస్తుంది అంటాను నేను. మాకు ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి. వారంతా స్థిరపడ్డారు. నా పెద్ద మనవరానికి వివాహం కూడా అయింది. ఇక ఖాళీ సమయాల్లో కవితలు, కథా రచన వ్యాపకం ఉండనే ఉంది. వారిద్దరూ నాకు గురువులే చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వీరిద్దరూ నాకు ఆదర్శనీయులే. ఒకసారి రామారావు గారు దాసరి గారితో అన్నారట బ్రదర్ రంగనాథ్ గారు మంచి నటులు. అయితే వారు మంచి దర్శకుల చేతిలో పడలేదు అని. నాగేశ్వరరావు గారు కూడా ఒక సారి 'నాకు ఇష్టమైన నటుడు అశోక్ కుమార్. నటనలో ఆయన ఈజ్ మీలో కనబడుతుంది' అన్నారు నాతో. అంతకన్నా ఏం కావాలి. నాతో చాలా మంది అంటుంటారు. మీకు అన్యాయం జరిగింది. మీకు రావాల్సిన గుర్తింపు రాలేదు అని. కానీ అందుకు నేను అంగీకరించను. నా కెవరో అన్యాయం చేసారని అనుకోను. నటుడినైతే చాలనుకొని వచ్చిన నాకు, ఎన్నో రకాల పాత్రలు, అవకాశాలు వరించాయి. ఆ తృప్తి చాలు. పదవులపై వ్యామోహం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు ఎన్నో సార్లు ఎన్నికల్లో పాల్గొనమన్నారు. సున్నితంగా తిరస్కరించా. ఇక రాజకీయాల సంగతి కొస్తే నేను రాజకీయాలకు సరిపడని వ్యక్తిని అని నాభావన. అయితే వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, నాయకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ కవితలు, రచనలు చేస్తుంటాను. సామాజిక సమస్యలపై కూడా కలం ఝుళిపిస్తుంటాను. నేను స్పందించి రాస్తానే తప్ప రాయాలని రాయలేను. అందుకే నా కవితల్లో, రచనల్లో ఆర్తి కనబడుతుందంటారు చాలా మంది. ఈ మధ్య కాలంలో గోపాల గోపాల చిత్రంలో న్యాయమూర్తి పాత్ర తృప్తినిచ్చింది. కొన్ని చిన్న సినిమాలూ చేస్తున్నాను. అలా సాగుతోంది జీవితం.
నాకు ఇష్టమైనవి
- నాకు ఇష్టమైన ఆట టెన్నిస్. - ఇంట్లో సుమారు 12 టెన్నిస్ బ్యాట్లుంటాయి. - రోజూ సాయంత్రం టెన్నిస్ ఆడాల్సిందే. ఒక వేళ షూటింగ్‌ల వల్ల ఇంటికి చేరేసరికి అర్థరాత్రో, అపరాత్రో అయిందంటే ఆ బ్యాట్లను తడిమి, వాటిని పలకరించికానీ నిద్రపోను. - దర్శకత్వం వహించాలన్న కోరిక బలంగా ఉండేది. మొగుడ్స్-పెళ్లామ్స్ అనే సినిమాకు డైరక్షన్ చేసాను. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో అలాంటి ప్రయత్నాలను విరమించుకున్నా.
ఇంటర్వ్యూ - శ్రీనాథ్ భూసిపాక
Please Share this article
Related:
Tagged with: ranganathinterview596345
ఊరంతా ఏమనుకుంటున్నారు?- శ్రీనివాస్ అవసరాల
చరణ్ చేయకపోతే నేనే చేస్తా - వరుణ్ తేజ్
అందుకే నెగెటివ్ పాత్రల్ని పక్కనపెట్టా
స్క్రిప్ట్ దొరికితే ఫ్రీ గా చేస్తా-లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ
సంపూర్నేష్‌బాబు ఇంటర్వ్యూ
శృతిహాసన్ పవన్ కళ్యాణ్ జోడి బాగాలేదా ? డాలీ ఇంటర్వ్యూ
ఎన్ని సినిమాలైనా ఆడతాయి-శర్వానంద్ ముచ్చట్లు
ఏడాదిలోపే సిక్స్ ప్యాక్ -చిరంజీవి ఇంటర్వ్యూ హైలైట్స్
ఎక్కువగా స్టడీ చేసింది క్రిష్ మాత్రమే
అదే జనాలను కూర్చోపెడుతుంది-చరణ్ ఇంటర్వ్యూ
విలన్‌గా నటించాలనే నా కోరిక తీరిపోయింది
నా దగ్గర పదేండ్లకు సరిపడా స్క్రిప్టులున్నాయి-పూరీ ఇంటర్వ్యూ
త్వరలోనే నిర్మాతగా
మెచ్చ్యూరిటీ పెరిగిందిరామ్ ఇంటర్వ్యూ
డేంజర్ నుంచి బయటపడ్డా-నాని
Read More From This Category