
📌 Key Points
- ఛత్తీస్‌గఢ్‌లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు.
- లొంగిపోయిన వారిలో ఏరియా కమిటీ కార్యదర్శులు, ట్రెజరర్లు ఉన్నారు.
- ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై లొంగిపోయిన మావోయిస్టులు.
- బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు సడలిందని భద్రతా బలగాలు అంచనా.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలకు ఆకర్షితులై ఒకేసారి 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఘటన మావోయిస్టుల ఉద్యమానికి భారీ నష్టంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మావోయిస్టుల లొంగుబాటుకు కారణాలు
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టు ఉద్యమానికి దాదాపు ఎండ్ కార్డు పడినట్లైంది. రాష్ట్ర ప్రభుత్వ ‘నియద్ నెల్లానార్’ (Niyad Nellanar) పథకం, పోలీసుల ‘లోన్ వర్రాటు’ (Lone Varratu) ప్రచారంతో ప్రభావితమై, వివిధ మావోయిస్టు దళాలకు చెందిన మొత్తం 25 మంది కీలక సభ్యులు ఈ రోజు గంగులూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ (SP Gaurav Rai), సీఆర్పీఎఫ్ (CRPF) అధికారుల సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది.
లొంగిపోయిన వారిలో ముఖ్య సభ్యులు
లొంగిపోయిన వారిలో గంగులూరు ఏరియా కమిటీ, కిష్టారం ఏరియా కమిటీ, భైరమ్‌గఢ్ ఏరియా కమిటీలకు చెందిన ముఖ్యమైన సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ కార్యదర్శులు, ఒకరు సంయుక్త కార్యదర్శి, నలుగురు ట్రెజరర్లు, ఆరుగురు కార్యవర్గ సభ్యులు, 12 మంది సాధారణ సభ్యులు ఉన్నారు. అందులో కొందరిపై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులు ప్రకటించింది. పీఎల్‌జీఏ కీలక సభ్యుడు మోతిరామ్ ఒయామ్ (Motiram Oyam), కేఏఎంఎస్ అధ్యక్షురాలు సుక్మతి ఒయామ్ (Sukmati Oyam), మిలీషియా కమాండర్ మడ్వి భీమా (Madvi Bhima) లొంగిపోయిన వారి జాబితాలో ఉన్నారు.
ప్రభుత్వం స్పందన, పునరావాస చర్యలు
మావోయిస్టు అగ్ర నాయకత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక పద్ధతులు, స్థానిక గిరిజనులపై జరుగుతున్న వేధింపులు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై తాము జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు వెల్లడించారు. వీరి లొంగుబాటును జిల్లా ఎస్పీ, సీఆర్పీఎఫ్ అధికారులు ధృవీకరించారు. సరెండర్ అయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ సహాయంగా రూ.25,000 నగదు, పునరావాస ప్యాకేజీని అందజేశారు. తుపాకీ పట్టిన యువత హింసను వీడి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సదువియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు. ఈ లొంగుబాటుతో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు మరింత బలహీనపడిందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
ఈ లొంగుబాటు బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గిస్తుందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.


