
📌 Key Points
- నటి రేవతి టీనేజ్‌లో బస్సులో ప్రయాణిస్తుండగా ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.
- రేవతి వెంటనే స్పందించి ఆ వ్యక్తి చెంపపై కొట్టి తన ధైర్యాన్ని నిరూపించుకుంది.
- తల్లి ఇచ్చిన ధైర్యంతోనే తాను అలా చేయగలిగానని రేవతి తెలిపింది.
- ఆడపిల్లలకు చదువుతోపాటు ఆత్మరక్షణ, మానసిక ధైర్యం కూడా అవసరమని రేవతి పేర్కొంది.
ప్రముఖ నటి రేవతి తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు. టీనేజ్‌లో బస్సులో ప్రయాణిస్తుండగా ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, వెంటనే అతనికి బుద్ధి చెప్పానని ఆమె తెలిపారు. తన ధైర్యానికి కారణం అమ్మ అని ఆమె చెప్పారు.
రేవతి ఎదుర్కొన్న చేదు అనుభవం
Actress Revathi: నటి రేవతి.. ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియదేమో కానీ, ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా మంచి మంచి చిత్రాలలో, మంచి మంచి పాత్రలు చేసి హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, మహిళలు ఎంత ధైర్యంగా ఉండాలో చెబుతూ.. నిజ జీవితంలో తను ఫేస్ చేసిన ఓ చేదు అనుభవాన్ని రేవతి (Actress Revathi) పంచుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మహిళలు ధైర్యంగా ఉంటే.. ఎవరూ ఏం చేయలేరని ఆమె తెలిపారు. అందుకుగానూ తన టీనేజ్ రోజుల్లో జరిగిన ఓ సంఘటనను ఆమె పంచుకున్నారు. ఆమె చెప్పిన విషయాన్ని గమనిస్తే.. ఇది ఆమె వ్యక్తిగత అనుభవమే కాదు, నేటి సమాజంలో వేధింపులను ఎదుర్కొంటున్న ప్రతి అమ్మాయికి ఒక స్ఫూర్తిదాయక సందేశమని చెప్పవచ్చు. అసలింతకీ ఆమె ఏం చెప్పారంటే..
అసభ్యకరంగా తాకిన ఆకతాయి..
ధైర్యంగా ప్రతిఘటించిన రేవతి
ఈ సందర్భంగా ఆమె తను ఫేస్ చేసిన ఘటన గురించి చెబుతూ.. తను 11వ తరగతి చదువుతున్న రోజుల్లో, బస్సులో ప్రయాణిస్తుండగా ఒక వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట. సాధారణంగా ఆ వయసులో ఉన్న అమ్మాయిలు ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు భయంతో వణికిపోతారు లేదా మౌనంగా ఉండిపోతారు. కానీ రేవతి మాత్రం ‘తప్పు చేస్తే తిరగబడాలి’ అనేలా.. ఏమాత్రం తడుముకోకుండా, అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి చెంపపై ఒక్కటిచ్చిందట. ఆ దెబ్బతో ఆ బస్సులో ఉన్నవారంతా షాకయినప్పటికీ, తర్వాత అక్కడ జరిగింది తెలిసి, అందుకే భలే మంచి పని చేశావ్ అంటూ ప్రశంసించారట. నిజంగా ఈ విషయం తెలిసిన తర్వాత రేవతి ఘట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే..
రేవతి ధైర్యానికి కారణం ఎవరు?
అందుకు కారణం ఎవరో కాదు తన అమ్మే అని రేవతి చెప్పుకొచ్చారు. ‘ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే భయపడకుండా ఎదురుతిరగమని మా అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను అలా చేయించింది’ అని రేవతి పేర్కొన్నారు. ఒక ఆడపిల్లకు చదువుతో పాటు, ఆత్మరక్షణ, మానసిక ధైర్యం ఎంత అవసరమో ఆమె మాటలు గుర్తు చేస్తున్నాయి. నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాల్సింది కేవలం మార్కులు మాత్రమే కాదు, సమాజంలోని ఇలాంటి మృగాలను ఎలా ఎదిరించాలో కూడా నేర్పాలని రేవతి వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. రేవతి ఎదుర్కొన్న ఘటన జరిగి దశాబ్దాలు గడిచినా, నేటికీ బస్సుల్లో, మెట్రోల్లో, కార్యాలయాల్లో ఇలాంటి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటి అమ్మాయిలు కేవలం బాధితులుగా మిగిలిపోకూడదని రేవతి ఘటన సందేశమిస్తోంది. తప్పు జరిగినప్పుడు మౌనంగా ఉండటం అంటే ఆ తప్పును ప్రోత్సహించడమే. రేవతి చేసినట్టుగా స్పాట్ లోనే స్పందిస్తే, అవతలి వ్యక్తికి భయం పుడుతుంది. తోటి ప్రయాణికులు, లేదంటే పక్కన ఉన్నవారు కూడా ఆ సమయంలో బాధితురాలికి అండగా నిలిస్తే.. ఇలాంటి సంఘటనలు చాలా వరకు పునరావృతం కావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రేవతి తన అనుభవంతో నేటి యువతులకు స్ఫూర్తినిచ్చారు. మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ధైర్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఆత్మవిశ్వాసంతో మెలగడం చాలా అవసరం.


