
తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో టీటీడీ చిన్నారుల కోసం జూలై 3 నుండి ‘అక్షర గోవిందం’, అన్నప్రాశన సేవలను ప్రారంభించనుంది. సనాతన ధర్మ సంప్రదాయాలను పెంపొందించి, చిన్నారుల విద్యారంభం, జీవితారంభం శుభప్రదంగా సాగేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయి.
Key Points
జూలై 3 నుండి తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో అక్షర గోవిందం, అన్నప్రాశన సేవలు ప్రారంభం.
3 నుండి 5 సంవత్సరాల చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రత్యేక కిట్ అందజేత.
ప్రతిరోజు 50 మంది చిన్నారులకు మాత్రమే అవకాశం, ముందస్తు నమోదు తప్పనిసరి.
తల్లిదండ్రులు సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాలని టీటీడీ సూచన.
అక్షర గోవిందం సేవలు: వివరాలు
చిన్నారుల్లో సనాతన ధర్మ సంప్రదాయాలపై ఆసక్తి పెంపొందించి, వారి విద్యారంభం, జీవితారంభం దైవానుగ్రహంతో శుభప్రదంగా సాగాలనే సంకల్పంతో టీటీడీ జూలై 3 నుండి తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో నూతనంగా “అక్షర గోవిందం”, అన్నప్రాశన కార్యక్రమాలను ప్రారంభించనుంది.
జూలై 03వ తేదీ మధ్యాహ్నం 12.00 నుండి 12.30 గంటల వరకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో, శ్రీ వకుళామాత సన్నిధిలో చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం అనంతరం ఆశీర్వచనం, ప్రసాదం, ప్రత్యేక “అక్షర గోవిందం కిట్” అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో 3 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు పాల్గొనవచ్చు. అక్షర గోవిందం కిట్‌లో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్ష తదితర పూజా , విద్యా సామగ్రిని ఉచితంగా అందజేస్తారు.
అన్నప్రాశన కార్యక్రమం: ప్రాముఖ్యత
అదేవిధంగా ఆలయ అర్చకుల పర్యవేక్షణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు తొలి అన్నప్రాశనను ఆగమోక్తంగా నిర్వహించి, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాతల ఆశీస్సులను అందజేస్తారు.
జూలై 4 నుండి మంగళవారం మినహా అన్ని రోజుల్లో వకుళమాత ఆలయ అర్చకులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఆలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ బ్యాచ్ కు 25 మంది చిన్నారులు చొప్పున రెండు బ్యాచ్‌లలో మొత్తం 50 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు గంట ముందస్తుగా ఆలయ ప్రాంగణంలో నమోదు చేసుకోవాలి. చిన్నారులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాలని టీటీడీ సూచించింది.
నమోదు ప్రక్రియ, పాల్గొనే విధానం
శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య అనుగ్రహంతో తమ పిల్లల విద్యారంభం, అన్నప్రాశనను పవిత్రంగా నిర్వహించుకునేందుకు ఈ ప్రత్యేక సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
ఈ ప్రత్యేక సేవలను భక్తులు సద్వినియోగం చేసుకొని, తమ చిన్నారుల విద్య, జీవితారంభాన్ని శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య అనుగ్రహంతో పవిత్రంగా నిర్వహించుకోవాలని టీటీడీ కోరుతోంది.


