
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలపై లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరున, అంటే జూన్ 30న ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సంకేతాలు ఇచ్చింది. ఇంటర్ మార్కుల వెయిటేజీ కారణంగా ఫలితాల ప్రక్రియలో జాప్యం జరిగింది.
Key Points
ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు జూన్ 30న విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇంటర్ సప్లిమెంటరీ, సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల కారణంగా విడుదల ఆలస్యం.
తుది ర్యాంకులకు ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది.
సీబీఎస్‌ఈ విద్యార్థులు మారిన మార్కులను జూన్ 27లోపు అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలి.
ఫలితాల విడుదల ఆలస్యానికి కారణాలు
AP EAPCET Results 2026 : ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఈఏపీసెట్-2026 ఫలితాలను జూన్ 30వ తేదీన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అన్ని రకాల కసరత్తు చేస్తోంది.
నిజానికి మొదట ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే….. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం, వాటి ఫలితాల వెల్లడిలో సమయం పట్టడంతో ఫలితాలు విడుదలకు లైన్ క్లియర్ కాలేదు. ఇటీవలనే ఈ ఫలితాలు విడుదలయ్యాయి.
మరోవైపు సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల ప్రక్రియ పూర్తికాకపోవడం మరో ప్రధాన కారణంగా ఉంది. ఈఏపీసెట్ తుది ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. దీనివల్ల ఇంటర్ మార్కుల నమోదు ప్రక్రియ పూర్తయితేనే ర్యాంకులను ఖరారు చేయడం సాధ్యమవుతుంది. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇప్పటికే విడుదల కాగా….. ఇప్పుడు సీబీఎస్‌ఈ మార్కుల ప్రక్రియ తుది దశకు చేరింది.
ఇంటర్ మార్కుల వెయిటేజీ: సీబీఎస్‌ఈ విద్యార్థులకు గడువు
ఇంటర్ మార్కుల వెయిటేజీకి ఎంతో ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో ఈఏపీసెట్ కన్వీనర్ సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్‌లలో మార్కులు పెరిగిన విద్యార్థులు ఎవరైనా ఉంటే….. వారు తమకు మారిన మార్కులతో కూడిన డిక్లరేషన్ ఫామ్‌ను జూన్ 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత సీబీఎస్‌ఈ అభ్యర్థుల మార్కుల డేటాను క్రోడీకరించి, తుది ఫలితాలను సిద్ధం చేయడానికి అధికారులకు మరో రెండు రోజుల సమయం పడుతుంది.
ఏపీ నుంచి కూడా పలువురు విద్యార్థులు… సీబీఎస్‌ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు వీరి సంఖ్య 8 వేల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ ఫలితాల ప్రక్రియ ముగిసిన వెంటనే జూన్ 30న లేదా ఆ తర్వాత తేదీలో ఏపీఈఏపీసెట్ ఫలితాలను వెల్లడించే సూచనలున్నాయి.
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ర్యాంకుల విడుదల తర్వాత….. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తుంది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.
ఫలితాలు తెలుసుకునే మార్గాలు
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ – 2026కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,29,474 మంది ఈఏపీసెట్ పరీక్షలు రాశారు. అంటే మొత్తం 92.60 శాతం హాజరు నమోదైంది.
ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల తేదీపై స్పష్టత రావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంటర్ మార్కుల వెయిటేజీ ప్రక్రియ పూర్తవడంతో, త్వరలోనే ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరగనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.


