
📌 Key Points
- బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్‌కు 4 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25 లక్షల జరిమానా.
- 2018లో న్యూ ఇయర్ వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరపగా డాక్టర్ అర్చన గుప్తా మృతి.
- తనకు శాస్త్రీయ పరిజ్ఞానం లేదంటూ ఎమ్మెల్యే చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.
- జూన్ 6న దోషిగా నిర్ధారణ, తాజాగా శిక్ష ఖరారు చేసిన ఢిల్లీ హైకోర్టు.
బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డాక్టర్ అర్చన గుప్తా మృతి కేసులో ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25 లక్షల జరిమానా విధించింది. ఈ ఘటన 2018లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జరిగింది.
గాల్లోకి కాల్పులు.. డాక్టర్ మృతి
బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్‍కు జైలు శిక్ష ఖరారైంది. డాక్టర్ అర్చన గుప్త మృతికి కారణమైన 2018 నాటి కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు 4 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని డాక్టర్ అర్చన భర్త వికాస్ గుప్తాకు చెల్లించాలని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాజ్ కుమార్ సింగ్ ను కోర్టు జూన్ 6వ తేదీన దోషిగా నిర్దారించగా ఇవాళ శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే రాజ్ కుమార్ సింగ్ భార్య సహా మరో ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఎమ్మెల్యే వింత వాదన.. కోర్టు తిరస్కరణ
బీహార్‌లోని సాహెబ్‌గంజ్ నియోజకవర్గ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ సోదరుడు 2018 డిసెంబర్ 31న (న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా) దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరి ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ సరదాగా గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఆయన గాల్లోకి కాల్చిన బుల్లెట్ వేడుకకు హాజరైన వికాస్ గుప్తా భార్య అర్చన గుప్తా (45)కు బలంగా తగిలింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించారు.
శిక్ష ఖరారు.. భారీ జరిమానా
ఈ కేసులో గత నెల జూన్ 6న ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే నేతృత్వంలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఎమ్మెల్యేను దోషిగా నిర్ధారించింది. అయితే తనకు జైలు శిక్ష విధించవద్దని శుక్రవారం ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన తనకు శాస్త్రీయ పరిజ్ఞానం లోపించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఒక వింత వాదనను కోర్టు ముందుంచారు. గాల్లోకి కాల్చిన బుల్లెట్ పారాబోలిక్ పథం (Parabolic Trajectory )లో ప్రయాణించి కింద ఉన్నవారికి తగులుతుందనే విషయం తాను ఊహించలేకపోయాని అందువల్ల శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరాడు. అయితే ఎమ్మెల్యే వాదనలను తోసిపుచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ కు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ శనివారం తీర్పును వెలువరించారు.
ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజా ప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ కేసు మరోసారి గుర్తుచేసింది. న్యాయం ఎవరికైనా ఒకటేనని కోర్టు స్పష్టం చేసింది.


