|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్! ఆర్డీటీ నిధులకు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

Published: 24-03-2026, 3:35 AM
  • ఆర్డీటీ సేవలకు కేంద్ర హోంశాఖ అనుమతి లభించడంతో నిధుల వినియోగానికి అడ్డంకులు తొలగిపోయాయి.
  • ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిధుల సేకరణకు కేంద్రం అనుమతిచ్చింది.
  • ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర హోంమంత్రి ప్రత్యేక చొరవ చూపారని సీఎం చంద్రబాబు అన్నారు.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్డీటీ పేదలకు అనేక సేవలు అందిస్తోంది.

రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి కేంద్ర హోంశాఖ విదేశీ నిధులు పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీని ద్వారా ఆర్డీటీ తన సేవా కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పేదల కోసం ఆర్డీటీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.

ఆర్డీటీకి కేంద్రం అనుమతి

విదేశీ నిధులు పొందేందుకు రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ)కి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఆర్టీడీ సేవలకు లైన్ క్లియర్ అయింది. ఆర్డీటీ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో దశాబ్ధాల కాలంగా ఎన్నో సేవలు కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తూ వస్తోంది.

ఈ సంస్థకు విదేశాల నుంచి నిధులు అందుతాయి. అయితే విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన అనుమతులను ఎఫ్‌సీఆర్‌ఏ (Foreign Contribution Regulation Act కింద నిలిపివేస్తూ ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించడానికి బ్రేక్ పడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి కార్యక్రమాల అమలుకు అంతరాయం కలిగింది.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు. ఆర్డీటీ సంస్థ సేవా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడకుండా ఉండేలా… రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎంపీలు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎఫ్‌సీఆర్‌ఏను కేంద్రం రెన్యువల్‌ చేసింది.

నిధుల వినియోగానికి అడ్డంకులు తొలగింపు

దశాబ్దాలుగా పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కు విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించటంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

“రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది గ్రామాల్లో పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్వచ్చంద సంస్థలకు విదేశాల నుంచి వ‌స్తున్న నిధుల‌ను నిలిపివేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయంతో సంస్థ సేవలకు అంతరాయం కలిగింది. అయితే సంస్థ అందిస్తున్న సేవలను వివరించి, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేయగా… ఆయన చూపిన ప్రత్యేక చొరవతో నేడు అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిధుల సేకరణకు ఆర్డీటీని కేంద్రం అనుమతించడం ద్వారా నిధుల రాక‌కు మార్గం సుగ‌మం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి… ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందుతున్న లక్షలాది మంది పేద ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు.

కేంద్రానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి లోకేశ్ ప్రకటించారు. “ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)‌‌‌‌‌‌‌ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దశాబ్దాల సేవాస్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు” అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.

ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ ను పునరుద్ధరించాలని చాలా మంది పోరాడారు. రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా ఈ విషయంపై తమ వంతు మద్దతును తెలిపాయి. సేవ్ ఆర్డీటీ పేరుతో పాదయాత్ర కూడా జరిగింది. విద్యార్థి సంఘాలు కూడా ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరాయి. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవటంతో… ఈ సేవలకు లైన్ క్లియర్ అయిపోయింది.

కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి అనుమతులు ఇవ్వడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు మరింత సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్డీటీకి ఒక ముఖ్యమైన విజయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.