|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తే ప్రభుత్వం సహించదు, సీఎం వార్నింగ్‌.. దర్శక నిర్మాతలతో భేటీ

Published: 25-08-2025, 7:48 AM
పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తే ప్రభుత్వం సహించదు, సీఎం వార్నింగ్‌.. దర్శక నిర్మాతలతో భేటీ

తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శక, నిర్మాతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పరిశ్రమలోని అనేక అంశాలపై చర్చ జరిగింది.

Key Points

1

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ దర్శక, నిర్మాతలతో భేటీ.

2

పరిశ్రమలో వ్యవస్థల నియంత్రణను ప్రభుత్వం సహించదని సీఎం హెచ్చరిక.

4

కార్మికుల నైపుణ్యాల అభివృద్ధికి కార్పస్ ఫండ్, స్కిల్ యూనివర్సిటీలో ఏర్పాట్లు.

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ

తెలుగు చిత్ర పరిశ్రమ సినీ కార్మికుల వేతనాల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆయన జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరించారు. దీంతో సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆదివారం టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్ట్స్ లోని ఆయన నివాసంలో టాలీవుడ్‌ దర్శకులు, నిర్మాతలు భేటీ అయ్యారు. ఇందులో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌, నిర్మాత దిల్‌రాజు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎస్కేన్, దామోదర ప్రసాద్‌ పాల్గొన్నారు.

వీరితోపాటు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి,వెంకీ కుడుముల, శ్రీకాంత్‌ ఓడెల వంటి వారు సీఎంని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సినిమా పెద్దలు, సీఎం మధ్య ఇండస్ట్రీకి సంబంధించిన చాలా విషయాలు చర్చకు వచ్చాయి. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిత్ర పరిశ్రమలో వ్యవస్థలను కొందరు నియంత్రించాలనుకుంటే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలని, సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడతానని, ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

పరిశ్రమలో వ్యవస్థల నియంత్రణపై సీఎం హెచ్చరిక

ఆయన ఇంకా మాట్లాడుతూ, పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అలాగే స్కిల్ యూనివర్సిటీలో సినిమా కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని, ఇలాంటి సమయంలో ఇండస్ట్రీలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించానని చెప్పారు. అదే సమయంలో నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

సినిమా కార్మికులకు ప్రభుత్వం నుండి సహకారం

కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వం తో వ్యవహరించాలని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందన్నారు. కార్మికులను, నిర్మాతలను కూడా తమ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. అదే సమయంలో సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని, ఇండస్ట్రీకి ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని చెప్పారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు రేవంత్‌ రెడ్డి. సినిమా పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్‌గానే ఉంటానని, హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే నా ధ్యేయమని సీఎం వెల్లడించడం విశేషం.

చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, కార్మికులు, నిర్మాతల మధ్య సమన్వయం చాలా ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.