|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘ధురంధర్ 2’లో దావూద్‌కు విషం! నిజంగా అలా సాధ్యమా? మెర్క్యూరీ మిస్టరీ వీడింది!

Published: 28-03-2026, 9:35 PM
షాకింగ్: 'ధురంధర్ 2'లో దావూద్‌కు విషం! నిజంగా అలా సాధ్యమా? మెర్క్యూరీ మిస్టరీ వీడింది!
  • ధురంధర్ 2లో దావూద్ ఇబ్రహీంకు విషం ఇవ్వడం సినిమాలోని ప్రధానాంశం.
  • కాన్సట్రేటెడ్ మెర్క్యూరీ శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.
  • సినిమాలో చూపినంత వేగంగా మెర్క్యూరీ ప్రభావం ఉండకపోవచ్చని వైద్యుల అభిప్రాయం.
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ స్ట్రాటజీ గూఢచారులకు శిక్షణ ఇస్తుంది.

ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్ 2’లో దావూద్ ఇబ్రహీంకు విషం ఇచ్చే సన్నివేశం చర్చనీయాంశమైంది. కాన్సట్రేటెడ్ మెర్క్యూరీతో ఇది సాధ్యమా? సినిమా వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సినిమాలో దావూద్ ఇబ్రహీం ఎపిసోడ్

ఆదిత్య ధర్​ రూపొందించిన “ధురంధర్​ : ది రివేంజ్”​లో అత్యంత సంతృప్తినిచ్చే విషయాల్లో ఒకటి.. బడే సాహెబ్​ అలియాస్​ దావుద్​ ఇబ్రహీం ఎపిసోడ్​! అతనికి కాన్సట్రేటెడ్​ మెర్క్యూరీ ఇవ్వడంలో హమ్జా అలీ మజారీ (రణ్​వీర్​ సింగ్​) విఫలమైనప్పటికీ, ఆ పనిని జమీల్​ జమాలీ (రాకేశ్​ బేడీ) పూర్తి చేసినట్టు సినిమా చివరిలో తెలుస్తుంది. విషం ఇవ్వడం వల్లే దావూద్​ ఇబ్రహీం జీవితాతం మంచానికే పరిమితం అయ్యాడని సినిమాలో చూపిస్తున్నారు.

మరి ఇందులో నిజం ఎంత? ఒక్క చుక్క కాన్సట్రేటెడ్​ మెర్క్యూరీ (డైమిథైల్​ మెర్క్యూరీ)ని శరీరంలోకి పంపిస్తే శరీరం నిజంగా విషపూరితం అవుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకోండి..

ధురంధర్​ 2 సినిమా క్లైమాక్స్ సమయంలో, జమీల్ జమాలీ (రాకేష్ బేడీ) హమ్జాకు ఒక ఫోటో చూపిస్తాడు. తాను మొదటిసారి పరిచయమైనప్పుడు దావూద్ ఇబ్రహీంతో కరచాలనం చేస్తున్న ఫోటో అది. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చిన కొన్ని గంటల తర్వాత, అందరితో కలిసి విందు చేస్తున్న సమయంలో బడే సాహెబ్ ఒక్కసారిగా ఇబ్బందికి గురవుతాడు. ఆ ఒకే ఒక్క మెర్క్యూరీ చుక్క అతనిపై నెమ్మదిగా విషంలా పనిచేసి, జీవితాంతం అనారోగ్యంతో విలవిలలాడేలా చేసిందని సినిమా సూచిస్తుంది.

ఇక ఎండ్ క్రెడిట్ సీన్‌లో, జస్క్రీత్ సింగ్ రంగీ (రణ్​వీర్ సింగ్) భారత్ కోసం గూఢచారులకు శిక్షణ ఇచ్చే ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ స్ట్రాటజీ’ (కల్పిత సంస్థ)లో శిక్షణ పొందుతుంటాడు. అక్కడ క్యాడెట్లకు మెర్క్యూరీ పాయిజన్​ ఉన్న ఒక క్యాప్సూల్‌ను పరిచయం చేస్తారు. ఆ సీన్‌లోని నిపుణుడు మాట్లాడుతూ.. అది ఒక చుక్క చర్మం ద్వారా లోపలికి ప్రవేశిస్తే, బాధితుడికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపిస్తాయని వివరిస్తాడు.

దీనిపై ఆకాష్ హెల్త్‌కేర్ న్యూరాలజీ విభాగం డైరెక్టర్ అండ్ హెచ్ఓడి డాక్టర్ మధుకర్ భరద్వాజ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. “కాన్సట్రేటెడ్​ మెర్క్యూరీ అనేది మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన న్యూరోటాక్సిన్ అనడంలో సందేహం లేదు. అయితే, సినిమాల్లో దీనిని చూపించే విధానం డ్రామా కోసం కొంత అతిశయోక్తిగా ఉంటుంది,” అని అభిప్రాయపడ్డారు.

కాన్సట్రేటెడ్ మెర్క్యూరీ నిజంగా పనిచేస్తుందా?

“కాన్సట్రేటెడ్​ మెర్క్యూరీ ఒక స్లో పాయిజన్‌లా పనిచేస్తుందనే భావనకు శాస్త్రీయ ప్రాతిపదిక ఉన్నప్పటికీ, సినిమాల్లో చూపించే విధానం ఎప్పుడూ పూర్తిగా ఖచ్చితమైనది కాకపోవచ్చు,” అని ఆయన జోడించారు.

కాన్సట్రేటెడ్​ మెర్క్యురీ పాయిజనింగ్ క్రమంగా జరుగుతుందనే విషయాన్ని నిపుణులు అంగీకరించారు. ముఖ్యంగా ‘మిథైల్ మెర్క్యురీ’ వంటి సేంద్రీయ పాదరసం సమ్మేళనాలు శరీరంలో కాలక్రమేణా పేరుకుపోతాయి. ఇటువంటి సందర్భాల్లో, ప్రారంభ లక్షణాలు చాలా స్వల్పంగా ఉండి గుర్తించడం కష్టమవుతుంది. చిరాకు, అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. “పాదరసం ప్రభావం కొనసాగితే వణుకు, జ్ఞాపకశక్తి సమస్యలు, మానసిక స్థితిలో మార్పులు, సమన్వయం దెబ్బతినడం వంటి తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి,” అని న్యూరాలజిస్ట్ వివరించారు.

“అయితే, పాదరసం చర్మం ద్వారా తక్షణమే లోపలికి చొచ్చుకుపోయి, నెమ్మదిగా ప్రాణాలు తీసే రహస్య ఆయుధంగా పనిచేస్తుందనే చిత్రీకరణ పూర్తిగా నిజం కాదు,” అని ఆయన స్పష్టం చేశారు. ద్రవ రూపంలో ఉండే ఎలిమెంటల్ మెర్క్యూరీ ఆరోగ్యంగా ఉన్న చర్మం ద్వారా సరిగ్గా లోపలికి వెళ్లదు, దాని ఆవిరిని పీల్చినప్పుడు లేదా దానిని మింగినప్పుడే అత్యంత ప్రమాదకరమని ఆయన వివరించారు.

ఈ కాన్సట్రేటెడ్​ మెర్క్యూరీ శరీరం లో ఉందో లేదో ల్యాబొరేటరీ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్స్‌పోజర్ రకం, సమయాన్ని బట్టి రక్తం, మూత్రం, జుట్టు నమూనాల విశ్లేషణ ద్వారా దీనిని గుర్తించవచ్చు. లక్షణాలు బయటపడటం మొదలయ్యాక, ఇది గుర్తించలేని విషమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు.

చికిత్సలో మొదటి దశ బాధితుడిని మెర్క్యూరీ ప్రభావం నుంచి దూరంగా ఉంచడం. ప్రారంభ దశలో అయితే, శరీరంలోని భార లోహాలను తొలగించే ‘ఖిలేషన్ థెరపీ’ ద్వారా కొన్ని రకాల పాదరసం ప్రభావాలను తొలగించవచ్చు. ఒకసారి నాడీ వ్యవస్థకు తీవ్రమైన నష్టం వాటిల్లితే, ఆ ప్రభావాలను పూర్తిగా సరిచేయడం కష్టమవుతుంది. కానీ, ముందస్తు నిర్ధారణ, సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా పరిస్థితి విషమించకుండా అడ్డుకోవచ్చని డాక్టర్ భరద్వాజ్ పేర్కొన్నారు.

నిపుణుల అభిప్రాయం: సినిమా అతిశయోక్తేనా?

ధురంధర్​ 2 సినిమాలో జమీల్ జమాలీ ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్లే దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు చూపించారు. దీనిపై డాక్టర్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్న చర్మంపై ఒక చుక్క కాన్సట్రేటెడ్​ మెర్క్యూరీ పడితే అంత తీవ్రమైన పాయిజనింగ్ జరిగే అవకాశం చాలా తక్కువని స్పష్టం చేశారు.

“మనుషులు నివసించే గదిలో మెర్క్యూరీని ఆవిరి రూపంలో పీల్చినప్పుడు లేదా విషపూరిత రూపంలో ఉన్న పాదరసాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒకే ఒక్క చుక్కతో ప్రాణాంతక ప్రక్రియ మొదలవుతుందనుకోవడం కేవలం విషయాలను సరళీకృతం చేసి చూపడమే. విష తీవ్రత అనేది అది ఏ రూపంలో ఉంది, ఎంత మోతాదులో ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది,” అని ఆయన వివరించారు.

“మెర్క్యూరీ ప్రమాదకరమైన టాక్సిన్ అనడంలో సందేహం లేదు. కానీ, దాని ప్రభావాలు సినిమాల్లో చూపించినట్లు తక్షణమే లేదా ఒక చుక్కతో ఉండవు. కలుషితమైన ఆహారం, పారిశ్రామిక వ్యర్థాలు లేదా పాదరసాన్ని తప్పుగా నిర్వహించడం వంటి నిజమైన ముప్పుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం,” అని ఆయన హెచ్చరించారు.

సినిమా ప్రకారం చూస్తే, బడే సాహెబ్ అనారోగ్య తీవ్రతను బట్టి జమీల్ జమాలీ అతనికి ఒకసారి కంటే ఎక్కువసార్లు షేక్ హ్యాండ్ ఇచ్చి ఉండవచ్చు లేదా మనం ఊహించని ఇతర మార్గాల్లో విషం ఇచ్చి ఉండవచ్చు. కానీ, ఒకే ఒక్క చుక్కతో అది సాధ్యం కాదనేది వైద్యుల మాట!

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More

కాన్సట్రేటెడ్ మెర్క్యూరీ ప్రమాదకరమైనప్పటికీ, సినిమాల్లో చూపించే విధానం వాస్తవానికి దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిపై మరింత లోతైన విశ్లేషణ అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.