|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గ్యాస్ మంటలు: పేదల కంట కన్నీళ్లు! మళ్లీ కట్టెల పొయ్యి రోజులు?

Published: 06-04-2026, 9:35 PM
  • LPG సిలిండర్ల ధరలు పెరగడంతో పేద కుటుంబాలు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నాయి.
  • కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగతో ఏటా 2.9 మిలియన్ల మంది మరణిస్తున్నారని WHO అంచనా.
  • యుద్ధాల కారణంగా చమురు ధరలు పెరిగి సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది.
  • గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

గతంలో కట్టెల పొయ్యిలతో ప్రజలు పడిన కష్టాలు మళ్లీ వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కట్టెల పొయ్యి కష్టాలు మళ్లీ మొదలు

సుమారు 20 సంవత్సరాల క్రితం వరకూ వంటకు ప్రధాన ఆధారం వంటచెరుకు. మన తల్లి అవి ఏరి కట్టుకొని తలపై మోసుకొని వచ్చేవారు.. చేతులకు కాళ్లకు ముళ్ల గాయాలై రక్తం కారినా, ప్రయాణంలో ఆమె కాళ్లు నొప్పితో వణికినా అవి తెచ్చి వంట చేసి మన కడుపు నింపేవారు. వంట చెరుకు సేకరణకు కాలాలతో పనిలేదు.. ఏ కాలమైనా నిత్యం ఇది ఒక యజ్ఞం లాగా ఉండేది .

భారతదేశంలో ఎంతో మంది మహిళలు ఈ సంఘటనలకు ఇప్పటికీ సజీవ ఉదాహరణలు.. చిన్నపిల్లలను సైతం కట్టెల సేకరణకు తీసుకువెళ్లేవారు. ఆ మహిళలు మోసింది కేవలం కట్టెలు మాత్రమే కాదు, కుటుంబ బాధ్యతలు, ప్రేమ, త్యాగం, కన్నీళ్లు.. వారి చెమట చుక్కల్లోనే వేడి భోజనం దాగి ఉంది. తిరిగి ఆ కట్టెల పొయ్యి పొగ మంటల కష్టాలు వస్తున్నందుకు మహిళలు ఆవేదన చెందుతున్నారు.

LPG ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం

రాత్రి పది గంటలు.. ఒక తల్లి ఖాళీ LPG సిలిండర్‌ను చూసుకుంటూ నిలబడింది. ఫోన్ చేస్తే ‘స్టాక్ లేదు’ అనే సమాధానం. పిల్లలు ఆకలితో నిద్రపోయారు. చివరికి కట్టెలతో మంట పెట్టింది. కళ్లలో పొగ చేరిన కన్నీళ్లతో ఒక్క సిలిండర్‌కు ₹900–₹1,000 ఉంటే.. మిగతా ఖర్చులు ఎలా?’ అనే ప్రశ్న ఆమెను వెంటాడుతోంది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల దీనగాధ. ప్రపంచంలో ఎక్కడో జరిగే యుద్ధాలు, మన వంటగదిలో తుఫాను, సునామి వంటి ప్రభావం చూపుతున్నాయి. యుద్ధాలు చమురు మార్కెట్లను కుదిపేసినప్పుడు, దాని ప్రభావం కరెన్సీ విలువలపై కూడా పడుతుంది. ఇక భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలకు రెండింతల భారం పడుతుంది. చమురు ధరతో పాటు డాలర్ ఖరీదు పెరుగుతుంది. ఫలితంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు దిగుమతి ఖర్చులు పెరుగుతాయి, ప్రభుత్వ సబ్సిడీ భారం పెరుగుతుంది, వినియోగదారులపై ధరల రూపంలో భారం మోపబ‌డుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో సరుకుల ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చివరకు ఈ మొత్తం ఆర్థిక సంక్షోభ యుద్ధ పొగ మేఘాలు మన వంట గదిలో ఊపిరి సలపకుండా అలముకుంటాయి.

LPG సిలిండర్ ధరలు ₹900 దాటితే, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు అది మోయలేని భారంగా మారుతుంది. సరఫరా అంతరాయం ఉంటే, బ్లాక్ మార్కెట్‌లో ₹3-4 వేల వరకు ధరలు చేరిన ఉదాహరణలు ఉన్నాయి.. దీంతో చాలామంది మళ్లీ కట్టెలు, బొగ్గు వంటకు వెళ్తున్నారు. WHO అంచనాల ప్రకారం, వంటగదిలో పొగ వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 2.9 మిలియన్ మరణాలు జరుగుతున్నాయి. భారతదేశంలో బయోమాస్ వాడకం వల్ల శ్వాసకోశ సమస్య లు గణనీయంగా పెరుగుతున్నాయి. అంతేకాదు మహిళలు రోజుకు 2 నుండి 4 గంటలు కట్టెల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఇది వారి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుంది. పిల్లలు పొగలో చదవడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఘన ఇంధనాల వాడకం వల్ల జీడీపీలో సుమారు 1% వరకు నష్టం జరుగుతోంది. ఇంధన సంక్షోభం, ఆరోగ్యం, విద్య, ఆర్థిక వ్యవస్థ, లింగ సమానత్వం అన్నింటినీ ప్రభావితం చేసే సమస్య.

ఆరోగ్యంపై కట్టెల పొయ్యి ప్రభావం

భారతదేశంలో సంవత్సరానికి సగటున 280 –300 ఎండ రోజులు ఉంటాయి. ఇది సౌరశక్తికి అనుకూలం. రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ (1–2 కిలోవాట్లు) రోజుకు 4–6 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలదు.. ఇది ఇండక్షన్ స్టౌవ్ ద్వారా వంటకు సరిపోతుంది. హైబ్రిడ్ సోలార్ కుకర్లు 100–150°C వరకు ఉష్ణోగ్రతను అందిస్తాయి. ఇది సాధారణ వంటకు సరిపోతుంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దీనివల్ల నెలకు ₹800–₹1,200 వరకు ఆదా అవుతుంది. అలాగే బయోగ్యాస్ ప్లాంట్లు (2 క్యూబిక్ మీటర్ సామర్థ్యం) రోజుకు ఒక కుటుంబానికి సరిపడా గ్యాస్‌ను ఉత్పత్తి చేయగలవు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఉత్తమ పరిష్కారం. దీని ద్వారా దిగుమతులపై ఆధారం తగ్గుతుంది, మహిళల శ్రమ తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధిపత్య ప్రపంచంలో యుద్ధాలు, సంక్షోభాలు ఆగవు.. కానీ మనం ఎలా ప్రతిస్పందిస్తామో అది మన భవిష్య‌త్తును నిర్ణయిస్తుంది. సూర్యశక్తి, స్థానిక వనరులు, సాంకేతికతను ఉపయోగించి ముందుకు సాగితే ఏ యుద్ధం వచ్చినా, మన వంటగది క్షేమంగా ఉంటుంది.

LPG ధరల పెరుగుదల పేద ప్రజల జీవితాలను దుర్భరం చేస్తోంది. ప్రభుత్వం సబ్సిడీలను పెంచి ప్రజలకు అందుబాటులో ధరలను ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.