
తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, తెలుగు సినిమా ప్రముఖులను అభినందించారు. ప్రభుత్వం కఠినంగా కనిపించినప్పటికీ, సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు.
Key Points
తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులను అభినందించారు.
తెలుగు సినిమా ప్రపంచస్థాయికి ఎదిగిందని, హైదరాబాద్ సినీ కేంద్రంగా ఎదగడం గర్వకారణమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
సినిమా అంటేనే హైదరాబాద్ అనే స్థాయికి ఎదిగేందుకు రాజమౌళి బాధ్యత తీసుకోవాలని సూచించారు.
గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
తెలంగాణ గద్దర్ అవార్డుల(Gaddar Awards) ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అవార్డు అందుకున్న సినీ ప్రముఖులు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు సినిమా(Telugu Movie) ఎదిగిందని ప్రశంసించారు. అలాంటి తెలుగు సినిమాకు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందని అన్నారు. చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి నటులు వారి వారి స్థాయిలో తెలుగు సినిమా స్థాయిని పెంచారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ కఠినం కాదు.. ఎక్కువ తక్కువ అనే తేడాలు లేకుండా అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని ఈ సందర్భంగా సినీ ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
సినీ అవార్డులు ఇస్తే బాగుందని నిర్మాత దిల్ రాజు(Dil Raju) ముందుగా ప్రతిపాదించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి విడుదలైన అన్ని సినిమాలకు అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. హాలీవుడ్ అంటే అమెరికా, బాలీవుడ్ అంటే ముంబై అనే పరిస్థితిని ఇక నుంచి మర్చిపోయి.. అసలు సినిమా అంటేనే హైదరాబాద్ అనే స్థాయికి తీసుకురావాలని అన్నారు. దీనికి దర్శకుడు రాజమౌళి బాధ్యత తీసుకోవాలని సూచించారు. మరో 20 ఏళ్ల పాటు తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని.. తాను ఏ స్థాయిలో ఉన్నా ఇండస్ట్రీ ప్రముఖులకు సహకరిస్తా అని హామీ ఇచ్చారు. ‘గద్దర్ అంటే చైతన్యం, గద్దర్ అంటే విప్లవం, గద్దర్ అంటే మార్పు. ఆయన స్ఫూర్తితోనే తాము పోరాటాలు చేశాం. రాష్ట్రాన్ని సాధించాం. అలాంటి గొప్ప వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడానికి మేము గర్వంగా ఫీలవుతున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
తెలుగు సినిమా భవిష్యత్తు
తెలుగు సినిమా ప్రగతికి ప్రభుత్వం సహకరిస్తుందని, హైదరాబాద్ ప్రపంచ సినీ కేంద్రంగా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమకు తన మద్దతు నిరంతరం ఉంటుందని హామీ ఇచ్చారు.


