|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పిల్లలు పుట్టడం లేదా? రాష్ట్రంలో జనాభా సంక్షోభం! ఆరోగ్య మంత్రి సంచలన హెచ్చరికలు!

Published: 30-03-2026, 12:35 PM
  • రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.50 శాతానికి పడిపోయిందని ఆరోగ్య మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
  • జనాభా స్థిరీకరణకు రేటు 2.10 అవసరం కాగా, నియంత్రణ విధానాలతో పడిపోయిందని మంత్రి తెలిపారు.
  • సంతానోత్పత్తి తగ్గితే కార్మిక శక్తి తగ్గి వృద్ధుల భారం పెరుగుతుందని మంత్రి హెచ్చరించారు.
  • ప్రభుత్వం నూతన విధానం ద్వారా కుటుంబాలు స్వచ్ఛందంగా పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తుంది.

రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోవడం పట్ల ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. జనాభా నియంత్రణ పద్ధతులపై పునరాలోచన చేయాలని సూచించారు.

సంతానోత్పత్తి రేటు క్షీణతపై మంత్రి ఆందోళన

రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు క్షీణించ‌డం కారణంగా ఘోరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని.. రాష్ట్ర ప్రజ‌ల్ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ హెచ్చరించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు క్రమేణా అతి త‌క్కువ‌గా 1.50కు ప‌డిపోవ‌డం, దాని ప‌రిణామాల‌పై మంత్రి తీవ్ర ఆందోళ‌న‌ను వెలిబుచ్చారు. ఈ స‌మ‌స్యను స‌మిష్టిగా ఎదుర్కోడానికి ప్రజ‌లు, మీడియా, ఇత‌ర భాగ‌స్వాములు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి న‌డుం బిగించాల‌ని పిలుపునిచ్చారు.

జ‌నాభా స్థిరీక‌ర‌ణ‌కు సంతానోత్పత్తి రేటు 2.10 అవ‌స‌రం కాగా.. ప‌లు ద‌శాబ్దాలుగా అనుస‌రించిన జ‌నాభా నియంత్రణ విధానంతో ఈ రేటు నేటికి 1.50 శాతానికి ప‌డిపోయింద‌ని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఇక‌నైనా దిద్దుబాటు చ‌ర్యల్ని చేప‌ట్టకుంటే ప్రజ‌లు, రాష్ట్ర ఆర్థిక ప్రగ‌తికి తీవ్ర విఘాతం ఏర్పడ‌నుంద‌ని మంత్రి హెచ్చరించారు. తీరు మార‌కుంటే అధిక యువశ‌క్తితో కూడిన జ‌నాభాతో ల‌భించే ప్రయోజ‌నం(పాపులేష‌న్ డివిడెండ్‌) 2040 నాటికి క‌నుమ‌రుగై.. అధిక శాతం వృద్ధుల‌తో కూడిన జ‌నాభా భారంగా (పాపులేష‌న్ డెట్‌) మార‌నుంద‌ని మంత్రి స్పష్టం చేశారు. సంతానోత్పత్తి క్షీణ‌త‌తో ఆర్థిక ప్రగ‌తికి ఊత‌మిచ్చే కార్మిక శ‌క్తి(వ‌ర్క్‌ఫోర్స్‌) త‌గ్గిపోయి భారీగా పెర‌గ‌నున్న వ‌యో వృద్ధుల భారాన్ని మోయాల్సి ఉంటుంద‌ని మంత్రి వెల్లడించారు.

2035నాటికి రాష్ట్రంలో జ‌నాభా స్థిరీక‌ర‌ణ ల‌క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నూత‌న ప్రణాళిక‌ను రూపొందించింద‌ని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన కుటుంబ నియంత్రణ ల‌క్ష్యాల సాధ‌నంగా అమ‌లైన జ‌నాభా నియంత్రణ విధానానికి స్వస్తి ప‌లికాలని కోరారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని క‌నేలా కుటుంబాలు స్వచ్ఛంద నిర్ణయాలు తీసుకునే అనుకూల ప‌రిస్థితుల్ని క‌ల్పించ‌డం ఈ నూత‌న విధానం ల‌క్ష్యమ‌ని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ అన్నారు.

జనాభా నియంత్రణ విధానంపై పునరాలోచన

‘త‌ల్లికి పూర్తి ఆరోగ్య భ‌ద్రత క‌ల్పించి ఆరోగ్యక‌ర‌మైన శిశువుల‌కు జ‌న్మనివ్వడం, వారి పోష‌ణ, పెంపు, పూర్తి ఆరోగ్యంతో కూడిన స‌మ‌ర్థులైన కౌమార, యువ‌శక్తికి దారులు వేయ‌డం, సాంఘిక భ‌ద్రత‌తో కూడిన, గౌర‌వ ప్రద‌మైన, ఉత్పాద‌క అవ‌కాశాల‌తో కూడిన జీవితానికి గ‌ట్టి పునాదులు వేయ‌డం ఈ నూత‌న ప్రణాళిక ల‌క్ష్యం.’ అని మంత్రి చెప్పారు.

ఇప్పటి వ‌ర‌కు అమ‌లు చేసిన జ‌నాభా నియంత్రణ విధానంతో రాష్ట్రంలో జ‌నాభా వృద్ధి రేటు 2011-15 కాలంలో ఉన్న 7.10 శాతం నుండి నేటికి 1.70 శాతానికి త‌గ్గింద‌ని, ఇదే మార్గంలో 2035 నాటికి మ‌రింతగా త‌గ్గి 0.30 శాతానికి ప‌డిపోతుంద‌ని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ ఆందోళ‌న వెలిబుచ్చారు. సంతానోత్పత్తి రేటు 1.68 నుండి 1.50కు ప‌డిపోయి స‌వ‌ర‌ణ చ‌ర్యలు చేప‌ట్టకుంటే ఇంకా క్షీణించే అవ‌కాశ‌ముంద‌ని మంత్రి స్పష్టం చేశారు.

ఈ ప‌రిణామాల ప‌ర్యవ‌సానాల‌ను వివ‌రిస్తూ.. ప్రస్తుత రాష్ట్ర జ‌నాభా మ‌ధ్యస్త వ‌య‌సు 32.50 సంవ‌త్సరాలుండ‌గా.. దేశ స్థాయిలో ఇది నాలుగున్నరేళ్ల త‌క్కువ‌గా కేవ‌లం 28 సంవ‌త్సరాలు మాత్రమే ఉంద‌న్నారు. ప్రస్తుత తీరు కొన‌సాగిస్తే ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతుంద‌ని, రాష్ట్రంలో వ‌య‌సు మ‌ళ్లే వారి సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని మంత్రి ఆందోళ‌న వ్యక్తం చేశారు.

నూతన విధానంతో ప్రోత్సాహకాలు

సంతానోత్పత్తి క్షీణ‌త కారణంగా రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు జ‌నాభా 2011లో మొత్తం జ‌నాభాలో 25 శాతం ఉండ‌గా ఇది 2036 నాటికి 15 శాతానికి త‌గ్గనుంద‌ని, దీనికి సమాంత‌రంగా 60 ఏళ్లు దాటిన వారి జ‌నాభా 10 శాతం నుండి దాదాపు రెట్టింపై 2036 నాటికి 19 శాతానికి, 2047 నాటికి 23 శాతానికి పెరిగి స్వర్ణాంధ్ర సాధ‌న ల‌క్ష్యానికి తీవ్ర విఘాత‌మేర్పడనుంద‌ని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ నేప‌థ్యంలో స్వర్ణాంధ్ర ల‌క్ష్య సాధ‌న‌కు రానున్న 10 సంవ‌త్సరాలు అత్యంత కీల‌క‌మ‌ని, 2035 నాటికి 2.10 సంతానోత్పత్తి రేటును సాధించి జనాభా స్థిరీక‌ర‌ణ‌కు బాటులు వేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జనాభా సంతులనతను కాపాడేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురావడం శుభపరిణామం. ప్రజలు ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి కోరారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.