|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రపంచం అంచున యుద్ధం! సామ్రాజ్యవాదం పెను ప్రమాదం!

Published: 18-03-2026, 10:05 PM
ప్రపంచం అంచున యుద్ధం! సామ్రాజ్యవాదం పెను ప్రమాదం!
  • ప్రపంచీకరణ పేరిట వెనుకబడిన దేశాల వనరుల దోపిడీ జరుగుతోంది.
  • అమెరికా ఆధిపత్య పోరుతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది.
  • ఉక్రెయిన్ సంక్షోభం, నాటో విస్తరణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.
  • యుద్ధాల వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది.

ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యాలు పెరిగి, యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

సామ్రాజ్యవాదం: ప్రపంచానికి పెను ప్రమాదం

ప్రస్తుత ప్రపంచ రాజకీయ యవనికపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. హర్ముజ్ జలసంధి దిగ్బంధనం, ముడి చమురు ధరల అమాంతం పెరుగుదల, అమెరికా-ఇజ్రాయెల్ ద్వయం యుద్ధోన్మాదం.. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం మరో పెను ప్రమాదం ముంగిట ఉన్నట్లు కనిపిస్తోంది.

అయితే, ఈ పరిణామాలను కేవలం సరిహద్దు వివా దాలుగానో లేదా ప్రాంతీయ ఆధిపత్య పోరుగానో చూడలేం.. వీటన్నింటి వెనుక ఉన్న అసలు కారణం ‘ తీవ్రమౌతున్నసామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యాలు’. పెట్టు బడిదారీ వ్యవస్థ తన ఉనికి కోసం జరుపుతున్న ఈ ఆఖరి పోరాటం మానవాళి మనుగడకే సవాలుగా మారింది.

ప్రపంచీకరణ అనేది కేవలం ఆర్థిక అనుసంధానం కాదు, అది సామ్రాజ్యవాద దేశాలు వెనుకబడిన దేశాల వనరులను దోచుకోవడానికి సృష్టించుకున్న ఒక సాధనం. పెట్టుబడికి సరిహద్దులు లేవని చెప్పే ఈ విధానం, వెనుకబడిన దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. నేడు ఇరాన్ చమురు రవాణాను అడ్డుకోవడం ద్వారా అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. ప్రపంచీ కరణ వల్ల ఏర్పడిన ఈ ‘పరస్పర ఆధారిత’ వ్యవస్థలో, ఒక చోట మొదలైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి దారితీస్తోంది.

యుద్ధోన్మాదం: ముంచుకొస్తున్న ముప్పు

ప్రస్తుత పరిస్థితులు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల నాటి వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం నుంచి నేటి ఇరాన్ యుద్ధ వాతావరణం వరకు ప్రతి సంఘటన అగ్రరాజ్యాల మధ్య ప్రత్యక్ష పోరుకు దారితీసేలా ఉంది. నాటో విస్తరణ, అణ్వాయుధాల మోహరింపు మానవాళి మనుగడకే ముప్పుగా మారాయి.. మిత్ర దేశాల వైముఖ్యం కనిపిస్తున్నా, ట్రంప్ వంటి నేతలు యుద్ధానికే మొగ్గు చూపడం మూడో ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని పెంచుతోంది. యుద్ధం కేవలం సైనికుల మరణంతో ఆగిపోదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనలకు, భారీ వలస లకు దారితీస్తుంది. అంతకంటే భయంకరమైనది ‘పర్యా వరణ వినాశనం’. ఆధునిక యుద్ధ తంత్రంలో వాడే రసాయ నాలు, పేలుడు పదార్థాలు భూమిని, నీటిని విషతుల్యం చేస్తున్నాయి.. చమురు బావుల దహనం, క్షిపణి దాడులు గ్లోబల్ వార్మింగ్‌ను వేగవంతం చేస్తున్నాయి. పర్యావరణం గురించి కబుర్లు చెప్పే అగ్రరాజ్యాలే ఈ వినాశనానికి ప్రధాన కారకులు కావడం గమనార్హం.

సామ్రాజ్యవాద యుగంలో దేశాల మధ్య బలాబలాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. దీనినే లెనిన్ ‘అసమాన ఆర్థిక, రాజకీయ అభివృద్ధి సిద్ధాంతం’గా పేర్కొన్నారు. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిన అమెరికా, బ్రిటన్ వంటి పాత శక్తులు నేడు బలహీనపడుతున్నాయి. అదే సమయంలో రష్యా, చైనా వంటి కొత్త శక్తులు ప్రపంచ మార్కెట్‌ను పునర్వి‌భజన చేయాలని కోరుకుంటున్నాయి. ఈ శక్తుల మధ్య జరిగే పోటీయే నేటి యుద్ధాలకు మౌలిక కారణం. ఉక్రెయిన్ సంక్షేమం నుంచి నేటి ఇరాన్ యుద్ధ వాతావరణం వరకు ఈ ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం సామ్రాజ్యవాద దేశాల ఆర్థిక మూలాలపై గొడ్డలి పెట్టు వంటిది. అమెరికా తన ‘పశ్చిమ ఆసియా అవుట్‌పోస్ట్’ అయిన ఇజ్రాయెల్ ద్వారా ఈ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోవాలని చూస్తోంది. కానీ, అమెరికా పిలుపునిచ్చిన యుద్ధానికి ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు నేడు వెనుకాడటం గమనార్హం. ఇది సామ్రాజ్యవాద కూటమిలో మొదలైన చీలికను సూచిస్తోంది. తన సొంత మిత్రదేశాలనే ఒప్పిం చలేని స్థితిలో ట్రంప్ ఉండటం అమెరికా సామ్రాజ్యవాద పతనానికి నిదర్శనం.

పర్యావరణంపై యుద్ధ ప్రభావం

యుద్ధం ఎప్పుడూ ఆయుధ వ్యాపారులకు, బహుళజాతి కంపెనీలకు లాభాల పంట పండిస్తుంది. చమురు ధరలు పెరిగితే సామాన్యుడి వంటింటి బడ్జెట్ తలకిందులవుతుంది, కానీ ఎక్సాన్ మొబిల్ వంటి చమురు దిగ్గజాలకు, లాక్హీడ్ మార్టిన్ వంటి ఆయుధ కంపెనీలకు వేల కోట్ల ఆదాయం వస్తుంది. రూపాయి విలువ పతనం కావడం వల్ల భారత్ వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి, సామాన్యుడి పొదుపు మొత్తం ఆవిరవుతోంది. పెట్టుబడిదారీ విధానం తన మనుగడ సంక్షోభం నుంచి బయటపడటానికి యుద్ధాన్ని ఒక సాధనంగా వాడుకుంటోంది.

సామ్రాజ్యవాదం ఉనికిలో ఉన్నంత కాలం యుద్ధాలు అనివార్యం. అయితే, ఈ యుద్ధాలను అడ్డుకోగల శక్తి కేవలం పీడిత ప్రజల పోరాటాలకే ఉంది. సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ క్లాస్ పీపుల్ అమెరికా యుద్ధ కాంక్షను ఎదిరించడం, పాలస్తీనా, ఇరాన్ ప్రజల పక్షాన నిలబడటం ఒక గొప్ప సామాజిక చైతన్యం. భారత్ ప్రస్తుతం గ్లోబల్ సౌత్ నాయకుడిగా ఎదగాలని చూస్తోంది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు, మరోవైపు ఇరాన్, రష్యాలతో చారిత్రక బంధాలు.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ కేవలం ప్రేక్షక పాత్ర పోషించకూడదు. సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని ఎండగడుతూ, ప్రపంచ శాంతి కోసం చొరవ చూపాలి. లేదంటే పెరిగిన చమురు ధరలు, పడి పోయిన రూపాయి విలువ మన దేశాభివృద్ధిని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తాయి.

రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ అన్నట్లు, కొన్ని దేశాలు దైవం కంటే ట్రంప్‌ను చూసి ఎక్కువ భయపడుతున్నాయి. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో నైతిక పతనానికి సంకేతం. సామ్రాజ్యవాద శక్తులు తమ ఉనికి కోసం ప్రపంచాన్ని శ్మశానంగా మార్చకముందే ప్రజలు మేల్కొనాలి. ట్రంప్, నెతన్యాహూ వంటి శక్తుల యుద్ధోన్మాదాన్ని ఓడించి, ప్రజల పక్షాన శాంతిని స్థాపించడమే నేటి తక్షణ కర్తవ్యం. అప్పుడే మానవాళికి అసలైన విముక్తి లభిస్తుంది.

అగ్రరాజ్యాల మధ్య వైరుధ్యాలు, యుద్ధ వాతావరణం ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు, శాంతి స్థాపనకు ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.