|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్త నిరసనల షెడ్యూల్.. 14న హైదరాబాద్‌లో

Published: 11-06-2026, 4:30 PM
కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్త నిరసనల షెడ్యూల్.. 14న హైదరాబాద్‌లో

దేశంలో నీట్ (NEET) ప్రవేశ పరీక్షలతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో వరుసగా చోటుచేసుకుంటున్న పేపర్ లీకేజీలు, అవకతవకలపై దేశ యువత సమరశంఖం పూరించింది. ఇందులో భాగంగా, యువత నేతృత్వంలోని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తన దేశవ్యాప్త శాంతియుత నిరసనల జోరు పెంచింది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని, ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రضాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ రూపొందించిన ఒక సుదీర్ఘ నిరసనల షెడ్యూల్‌ను ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈ దేశవ్యాప్త పోరాటానికి మహారాష్ట్రలోని విద్యా హబ్ అయిన పుణే నగరం తొలి వేదికగా నిలిచింది. పుణేలోని ప్రతిష్టాత్మక సావిత్రీబాయి ఫూలే పూణే యూనివర్సిటీ (SPPU) క్యాంపస్‌లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ఎత్తున విద్యార్థులు, యువత తరలివచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు.

CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నేతృత్వంలో సాగిన ఈ బహిరంగ సభకు ప్రముఖ పర్యావరణ, సామాజిక విద్యావేత్త సోనం వాంగ్చుక్ సైతం విచ్చేసి విద్యార్థుల పోరాటానికి తన మద్దతును ప్రకటించారు. ఈ సభ వేదికగానే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా రూపొందించిన అత్యంత కీలకమైన ‘ఎడ్యుకేషన్ మ్యానిఫెస్టో’ను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో పరీక్షల లీకేజీల నివారణ, ఫలితాల సకాలంలో విడుదల, నియామకాల్లో పారదర్శకత, పరీక్షా బోర్డుల జవాబుదారీతనం వంటి అంశాలను ప్రధానంగా పొందుపరిచారు.

పుణేలో విజయవంతంగా ప్రారంభమైన ఈ నిరసనల పర్వం రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకూ విస్తరించనుంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లో ‘చలో ధర్నా చౌక్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్‌లో ఉదయం 10:00 గంటలకు ఈ శాంతియుత ఆందోళన జరగనుంది. అదే రోజున బెంగళూరులోనూ నిరసనలు జరగనుండగా.. లక్నోలో జూన్ 12న, అమృత్సర్ లో 13న, 15న జైపూర్ వంటి నగరాల్లో విద్యార్థులు రోడ్లపైకి రానున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ వరుస ఆందోళనల అనంతరం, జూన్ 20వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించబోయే ఒక భారీ ముగింపు ర్యాలీతో ఈ నిరసనల మొదటి విడత ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత అంతా రాజకీయాలకు అతీతంగా ఈ శాంతియుత పోరాటంలో భాగస్వాములు కావాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.