
కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆయనకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఆయన శుక్రవారం లోపు క్షమాపణ చెప్పకపోతే, థగ్ లైఫ్ సినిమా రిలీజ్ నిషేధిస్తామని ప్రకటించింది.
Key Points
కర్ణాటక ఫిలిం ఛాంబర్ కమల్ హాసన్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
కన్నడ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్.
క్షమాపణ లేకపోతే థగ్ లైఫ్ సినిమా రిలీజ్ నిషేధం హెచ్చరిక.
శుక్రవారం లోపు క్షమాపణ లేకపోతే, కన్నడ సంఘాలతో కలిసి నిరసనలు
కమల్ హాసన్ పై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆగ్రహం
కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) గురువారం (మే 29) కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చింది. కన్నడ భాషపై అతడు చేసిన కామెంట్స్ కు క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో రిలీజ్ కానివ్వమని స్పష్టం చేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. అసలు కన్నడ భాష వచ్చిందే తమిళం నుంచి అని కమల్ అనడం వివాదానికి కారణమైంది.
కన్నడ భాషను కించపరిచేలా మాట్లాడిన కమల్ హాసన్ శుక్రవారం (మే 30)లోపు పబ్లిగ్గా క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ హాసన్ ను డిమాండ్ చేసింది. ఛాంబర్ ప్రెసిడెంట్ నరసింహలు గురువారం మీడియాతో మాట్లాడారు. కమల్ చేసింది చాలా తప్పని అన్నారు.
థగ్ లైఫ్ రిలీజ్ పై ఉద్రిక్తత
“చాలా కన్నడ గ్రూపులు అతని సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే మేము సమావేశమై చర్చించాం. అతడు క్షమాపణ చెప్పాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చాము. అతడు చేసింది తప్పని మేమందరం అంగీకరించాం. అతన్ని కలిసి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాం” అని నరసింహలు చెప్పారు.
ఇక ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు గోవిందు కూడా దీనిపై స్పందించారు. శుక్రవారం లోగా కమల్ క్షమాపణ చెప్పకపోతే.. మూవీ రిలీజ్ కానివ్వమని స్పష్టం చేశాడు. “కమల్ హాసన్ పై మాకు సానుభూతి లేదు. ఈరోజో రేపో అతడు పబ్లిగ్గా క్షమాపణ చెప్పకపోతే.. మేము కన్నడ సంఘాలకు మద్దతిస్తూ నిరసన తెలుపుతాం. క్షమాపణ చెప్పకపోతే సినిమాను రిలీజ్ చేయించే ప్రసక్తే లేదు” అని ఆయన తేల్చి చెప్పారు.
క్షమాపణ లేకపోతే తీవ్ర పరిణామాలు
కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందే అంటూ ఈ మధ్యే కమల్ హాసన్ అన్నాడు. ఈ వివాదంపై బుధవారం (మే 28) కూడా అతడు స్పందించాడు. కానీ తాను ఈ విషయం అత్యంత ప్రేమతోనే చెప్పానని, ప్రేమ ఎప్పుడూ క్షమాపణ కోరదని అన్నాడు. తమిళం నుంచి కన్నడ వచ్చిందన్న విషయం చరిత్రకారులే చెప్పారని, దీనిని వాళ్లకే వదిలేయాలని సూచించాడు. కమల్ నటించిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న రిలీజ్ కావాల్సి ఉంది.
కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ముగింపు పలకాలి. లేనిచో థగ్ లైఫ్ రిలీజ్ అనిశ్చితంలోనే ఉంటుంది. కర్ణాటక ప్రేక్షకుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరం.


