
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇక లేరు. 83 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు సాయంత్రం జరిగాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మరణంపై విషాదం వ్యక్తం చేస్తున్నారు.
Key Points
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు.
83 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణం.
చివరి చిత్రం 'హరిహర వీరమల్లు'.
కోట శ్రీనివాసరావు మరణం
విలన్ గా భయపెట్టి.. కామెడీ ఆర్టిస్ట్ గా నవ్వించి.. ఓ తండ్రిగా దారి చూపి.. ఓ బాధ్యత కలిగిన వ్యక్తిగా మనసు లోతుల్లో నిలిచిపోయిన కోట శ్రీనివాస రావు ఇక లేరు. ఆదివారం (జూలై 13) తెల్లవారుజామున మరణించిన కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు తాజాగా ముగిశాయి. 750కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన నటనతో అలరించిన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాస్ రావు మరణ వార్తను సెలబ్రిటీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
83 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు కోట శ్రీనివాస రావు . ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో కోట మరణించారు. సాయంత్రం సుమారు 4.30 గంటలకు కోట శ్రీనివాస్ రావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్ నగర్ నుంచి మహా ప్రస్థానం వరకూ అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం పెద్ద మనవడు శ్రీనివాస్ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. కోట శ్రీనివాస రావు ఏకైక కుమారుడు కోట ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
అంత్యక్రియలు మరియు అభిమానుల ప్రతిస్పందన
విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు. ఆయన కన్నెర్ర చేస్తే ఆడియన్స్ భయపడేవాళ్లంటే అతిశయోక్తి కానే కాదు. 1942లో కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాస రావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెరంగేట్రం చేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని క్యారెక్టర్లు ప్లే చేశారు. 750కి పైగా సినిమాల్లో నటించారు.
కోట శ్రీనివాస రావు 9 నంది అవార్డు లు సొంతం చేసుకున్నారు. ప్రతిఘటన సినిమాలో యాక్టింగ్ కు తొలిసారి నంది అందుకున్నారు. ఆ తర్వాత గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, పెళ్లైన కొత్తలో, ఆ నలుగురు, పృథ్వీ నారాయణ సినిమాల్లో అమేజింగ్ యాక్టింగ్ తో నంది పురస్కారాలను ఖాతాలో వేసుకున్నారు. 2015లో పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్నారు.
సుదీర్ఘ సినీ ప్రస్థానం
‘అహ నా పెళ్లంటా’ సినిమాలో పిసినారి గా, ‘గణేష్’ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా, ‘సంతోషం’ సినిమాలో నవ్వించే బాస్ గా.. ఇలా విభిన్నమైన పాత్రలు పోషించారు కోట శ్రీనివాస రావు.
కన్నుమూసిన కోట శ్రీనివాస రావును చివరిసారిగా ఓ మూవీలో చూసే అవకాశం ఉంది. చనిపోవడానికి ముందు పవన్ కల్యాణ్ ‘ హరిహర వీరమల్లు ’ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశారు కోట. ఈ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది.
తెలుగు సినీ రంగానికి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినిమా ప్రేమికులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.


