|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లెన్స్‌కార్ట్‌లో ‘బొట్టు’ వివాదం

Published: 19-04-2026, 6:05 PM
లెన్స్‌కార్ట్‌లో 'బొట్టు' వివాదం

ప్రముఖ ఐవేర్ బ్రాండ్ ‘లెన్స్‌కార్ట్’ (Lenskart) ప్రస్తుతం ఒక భారీ వివాదంలో చిక్కుకుంది. సంస్థకు చెందిన అంతర్గత గ్రూమింగ్ గైడ్‌లైన్స్ అనగా ఉద్యోగుల డ్రెస్ కోడ్ కు సంబంధించిన ఒక డాక్యుమెంట్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ గొడవ మొదలైంది. ఆ డాక్యుమెంట్‌లో హిందూ సంప్రదాయ చిహ్నాలైన బొట్టు, తిలకం,కంకణాలు ధరించడాన్ని స్టోర్ సిబ్బందికి నిషేధించినట్లు, అదే సమయంలో హిజాబ్, టర్బన్‌లకు అనుమతి ఇచ్చినట్లు ఉండటంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది మతపరమైన వివక్ష అని ఆరోపిస్తూ హ్యాష్‌ట్యాగ్ బాయ్ కాట్ లెన్స్‌కార్ట్‌ అంటూ ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది.

లీక్ అయిన డాక్యుమెంట్ ప్రకారం.. కస్టమర్లతో నేరుగా మాట్లాడే సిబ్బంది నుదుటిపై పెద్దగా బొట్టు లేదా తిలకం ధరించకూడదని, సిందూరాన్ని కూడా చాలా పరిమితంగానే ఉంచాలని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, నలుపు రంగు హిజాబ్ మరియు టర్బన్ ధరించడానికి అనుమతి ఉండటంతో, లెన్స్‌కార్ట్ కేవలం హిందూ సంప్రదాయాలపైనే ఆంక్షలు విధిస్తోందని బజరంగ్ దళ్ వంటి పలు హిందూ సంస్థలు మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల లెన్స్‌కార్ట్ షోరూమ్‌ల వద్ద నిరసనకారులు ఉద్యోగులకు తిలకాలు దిద్ది తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లోని పలు లెన్స్‌కార్ట్‌ స్టోర్లలో హిందూ సంఘాల నాయకులు వెళ్లి సిబ్బందికి బొట్టు పెట్టారు. ఈ వ్యవహారంపై కార్పొరేట్ సంస్థలు భారతీయ సంస్కృతిని అవమానిస్తున్నాయంటూ నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

సీఈఓ పీయూష్ బన్సాల్ స్పందన

వివాదం ముదురుతుండటంతో లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ పీయూష్ బన్సాల్ రంగంలోకి దిగి స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆ డాక్యుమెంట్ చాలా పాతదని (Outdated), అది తప్పుడు సమాచారంతో కూడి ఉందని ఆయన పేర్కొన్నారు. “లెన్స్‌కార్ట్ అన్ని మతాలను, సంప్రదాయాలను గౌరవిస్తుంది. మా ప్రస్తుత పాలసీలో బొట్టు, తిలకం, కలావ, సిందూరం, హిజాబ్ లేదా టర్బన్.. ఇలా దేనిపైనా నిషేధం లేదు. ఉద్యోగులు తమ మతపరమైన విశ్వాసాలను పాటించే పూర్తి స్వేచ్ఛ ఉంది” అని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, ఈ వివరణతో నెటిజన్లు సంతృప్తి చెందడం లేదు. ఒకప్పుడు అటువంటి నిబంధన ఎందుకు ఉందనే ప్రశ్నలను చాలా మంది లేవనెత్తుతున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.