|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన! ఉత్పత్తి భారీగా పెంచామని వెల్లడి!

Published: 18-03-2026, 8:05 AM
  • దేశంలో ఎల్పీజీ కొరత లేదని కేంద్రం స్పష్టీకరణ.
  • దేశీయ రిఫైనరీల్లో 40% ఎల్పీజీ ఉత్పత్తి పెంపు.
  • హార్మూజ్ జలసంధి వద్ద సురక్షితంగా 22 భారతీయ ట్యాంకర్లు.
  • పీఎన్‌జీకి మారాలని వినియోగదారులకు ప్రభుత్వం విజ్ఞప్తి.

దేశంలో వంటగ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 40 శాతం పెంచినట్లు పెట్రోలియం శాఖ తెలిపింది. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది.

ఎల్పీజీ కొరతపై కేంద్రం ప్రకటన

అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ (cooking gas) పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో (LPG) సరఫరాపై నెలకొన్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా దేశీయ రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తిని 40 శాతం మేర పెంచామని, దేశవ్యాప్తంగా ఎక్కడా గ్యాస్ స్టాక్ నిలిచిపోయిన (Dry-out) పరిస్థితి లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ (Sujata Sharma) ఈ రోజు మధ్యాహ్నం స్పష్టం చేశారు. అలాగే హర్మూజ్ జలసంధి వద్ద ఉన్న 22 భారతీయ ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయని, ఇప్పటికే ‘నందాదేవి’, ‘శివాలిక్’ నౌకలు గుజరాత్ తీరానికి చేరుకుని అన్-లోడింగ్ ప్రక్రియను ప్రారంభించాయని ఆమె తెలిపారు.

దేశీయంగా ఉత్పత్తిని పెంచిన ప్రభుత్వం

ప్రజలు సోషల్ మీడియా పుకార్లను నమ్మి పానిక్ బుకింగ్స్ (Panic bookings) చేయవద్దని, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంటే సిలిండర్లు నేరుగా ఇంటికే అందుతాయని భరోసా ఇచ్చారు .వ్యాపార అవసరాల కోసం ఇప్పటికే 15 రాష్ట్రాలు కమర్షియల్ సిలిండర్ల కేటాయింపును ప్రారంభించాయని, గత నాలుగు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 7,200 టన్నుల కమర్షియల్ ఎల్పీజీని పంపిణీ చేసినట్లు సుజాత శర్మ వివరించారు. భారత్ దాదాపు 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందున ఎటువంటి కొరత ఉండదని, మన రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

పీఎన్‌జీకి మారాలని ప్రజలకు విజ్ఞప్తి

అలాగే గృహ వినియోగదారులు సాధ్యమైనంత వరకు ఎల్పీజీ (LPG) నుండి పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) కి మారాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. దీనివల్ల ఎల్పీజీపై ఒత్తిడి తగ్గుతుందని, ఇప్పటికే దేశంలోని 60 లక్షల కుటుంబాలు పీఎన్‌జీకి మారే అవకాశం ఉందని అధికారులు గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. ఎల్పీజీ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించింది.

దేశంలో ఎల్పీజీ కొరత లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పీఎన్‌జీకి మారడం ద్వారా మరింత ఉపశమనం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.