కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీపీఐ(ఎం)(CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి(72)(Sitaram Yechury) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్(Delhi AIIMS)లో చేరి చికిత్స తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా.. దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది.
కాగా, 1952లో చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి.. 1975లో తొలిసారి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ. ఆయన పూర్తిపేరు ఏచూరి సీతారామారావు. పదో తరగతి వరకు హైదరాబాద్‌లో చదువుకున్న ఆయన.. ఢిల్లీ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ చదివారు. జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1985లో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో పొలిట్‌బ్యూరోలో చోటుదక్కించుకున్నారు. 2005లో తొలిసారి బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015, 2018, 2022లో మూడుసార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
గత నెల 17వ తేదీన ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆయనను ఐసీయూకి తరలించారు. నిపుణులైన వైద్య బృందంతో ట్రీట్‌మెంట్ అందించారు. దాదాపు రెండు వారాలకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చివరకు ఇవాళ మధ్యాహ్నం పరిస్థితి విషమించి కన్నుమూశారు.