| దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హీట్ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రేపే సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.
‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబర్ 17, మంగళవారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది’ అని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే నివేదించింది. ఇందుకోసం కేజ్రీ రేపు లెఫ్టినెంట్ గవర్నర్ (Lt Governor) వీకే సక్సేనా (VK Saxena) అపాయింట్‌మెంట్ కోరినట్లు ఆప్ వర్గాలు తెలిపినట్లు సదరు నివేదిక పేర్కొంది. రేపు సాయంత్రం 4:30 గంటలకు ఎల్జీని కేజ్రీ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తన రాజీనామాను సమర్పించొచ్చని సదరు వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఇదిలా ఉండగా.. పార్టీ తదుపరి చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆప్ సీనియర్ నాయకులు ఇవాళ సాయంత్రం సమావేశం కానున్నారు.
కాగా, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి తన స్థానాన్ని భర్తీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
ఇదే సమయంలో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అతిశీ. కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో అన్నీ తానై పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలను చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. కేబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలను కూడా చూస్తున్నారు. విద్య, ఆర్థికం, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, వాటర్, పవర్, పౌర సంబంధాలు వంటి కీలక శాఖలను అతిశీ నిర్వహిస్తున్నారు. ఎడ్యుకేషన్‌పై వేసిన స్టాండింగ్ కమిటీకి ఆమె చైర్ పర్సన్‌గానూ పనిచేశారు.
అతిశీతోపాటు సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఎంపీ రాఘవ్ చద్ధా పేర్లను ఆప్ పరిశీలిస్తున్నట్టు మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక మనీశ్ సిసోడియా (Manish Sisodia).. కేజ్రీవాల్ బాటలోనే పయనిస్తున్నారు. ప్రజలు తన నిజాయితీని ఆమోదిస్తే మాత్రమే తాను కూడా మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా తిరిగి వస్తానంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. మరోవైపు ఇక ఇవాళ ఉదయం కేజ్రీని సిసోడియా కలిశారు. రాజీనామా ప్రకటన తర్వాత ఆప్ చీఫ్‌తో సిసోడియా తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై చర్చ జరిగినట్లు తెలిసింది.