అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. తనకు సమీపంలోనే కాల్పులు జరగడంతో ఆయన అభిమానులను ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు. తానుసురక్షితంగానే ఉన్నట్లు ఈమెయిల్ ద్వారా వెల్లడించారు.” నన్ను ఏదీ ఆపదు. ఎప్పటికీ లొంగను. నన్ను ప్రోత్సహిస్తున్న వారందర్నీ ప్రేమిస్తున్నా” అని అందులో పేర్కొన్నారు. “ట్రంప్ పరిసరాల్లో తుపాకీ కాల్పులు జరిగాయి. ఆయన సురక్షితంగా ఉన్నారు” అని అతని ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. “భయపడాల్సినపనిలేదు! నేను క్షేమంగా ఉన్నా. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దేవునికి ధన్యవాదాలు!” అని ట్రంప్ ఏఎఫ్ పీ మీడియాతో అన్నారు.
అసలేంజరిగిందంటే?
ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతను గన్ తో తిరగడంతో.. ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దర్యాప్తు చేసింది. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొనే దుండగుడు ఏకే 47 మోడల్ వంటి తుపాకీతో సంచరించినట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది. మాజీ అధ్యక్షుడిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే అతడు గన్ తో అక్కడికి వచ్చినట్లు గుర్తించామంది. నిందితుడ్ని నార్త్ కరోలినాకు చెందిన ర్యాన్ వెస్లీ రౌత్ గుర్తించినట్లు తెలిపింది. నిందితుడి నుంచి ఏకే 47 రైఫిల్, గోప్రో స్వాధీనం చేసుకున్నామంది. ట్రంప్ కి 400 నుంచి 500 గజాల దూరంలోనే గన్ తో కాల్పులు జరిపేందుకు సిద్దమవుతుండగా భద్రతా ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఆ తర్వాత నిందితుడ్ని అరెస్టు చేసినట్లు వెల్లడించింది.
స్పందించిన బైడెన్
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ‘‘ట్రంప్ సురక్షితంగా ఉన్నారు. ఆయనపై హత్యాయత్నం చేసిన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నాడు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. దేశంలో రాజకీయ హింసకు చోటు లేదని మరోసారి గుర్తుచేస్తున్నా. ట్రంప్‌నకు అన్ని రకాలుగా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించా’’ అని పేర్కొన్నారు. “ఆయన సురక్షితంగా ఉన్నందుకు సంతోషం.” అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఎవరీ రౌత్?
నార్త్ కరోలినాలోని గ్రీన్స్‌బోరోకు చెందిన ర్యాన్ వెస్లీ రౌత్ గతంలో నిర్మాణ రంగం కార్మికుడిగా పనిచేసేవాడు. అతడికి ఎలాంటి మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ లేదని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. గతంలో చాలాసార్లు సాయుధ పోరాటంలో పాల్గొనాలనే బలమైన కోరికలు ఉండేవట. ఉక్రెయిన్ – రష్యా యుద్ధానికి సంబంధించి తన మనసులోని మాటలను సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘ఫైట్ అండ్ డై’ అంటూ పోస్టులు పెట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మెసేజింగ్ అప్లికేషన్ సిగ్నల్‌లో.. రౌత్ తన ప్రొఫైల్ బయోలో భాగంగా “పౌరులు ఈ యుద్ధాన్ని మార్చాలి. భవిష్యత్తులో జరిగే యుద్ధాలను నిరోధించాలి” అని రాసుకొచ్చినట్లు తెలుస్తోంది . “మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడంలో మనలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ మన వంతు కృషి చేయాలి; ప్రతి ఒక్కరూ చైనీయులకు సహాయం చేయాలి” అని అతని వాట్సాప్ బయోలో ఉంది. ఇకపోతే, రౌత్ పై 2002లోను కేసు నమోదైదిం. గ్రీన్స్‌బోరోలో పూర్తిగా ఆటోమేటిక్ ఆయుధంతో భవనం లోపల ఉన్న తనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, కేసు వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అయితే, తన తండ్రి చాలా మంచి వ్యక్తంటూ రౌత్ కుమారుడు ఓరన్ వెల్లడించారు. ‘గొప్ప తండ్రి, గొప్ప వ్యక్తి. తప్పకుండా అతడి నిజాయతీ బయటకు వస్తుందని ఆశిస్తున్నా’ అని తెలిపారు.