గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల వివరాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. జూన్ 27 నుంచి ఇప్పటివరకూ 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు హైడ్రా పేర్కొంది. 111.72 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. హైదరాబాద్ పరిధిలోని 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు హైడ్రా వెల్లడించింది.
27.06.2024 న ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ సొసైటీ, ప్లాట్ నంబర్.30 (లోటస్ పాండ్)తో మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు దుండిగల్ మండలం మల్లంపేట్ గ్రామంలోని 13 విల్లాల కూల్చివేతల వరకూ కొనసాగాయి. మున్ముందు మరిన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. FTL, బఫర్ జోన్లోని నాలాలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేల మట్టం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసింది.
హైడ్రా పనితీరుపై ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుండటంతో హైడ్రాను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలను గుర్తించి బాధ్యులకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో అన్ని డిపార్టుమెంట్లను ఒకే గొడుగు కింద తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఫాంహౌస్‌లు, ఆక్రమణలపై ఉక్కుపాదం: సీఎం రేవంత్ రెడ్డి కీలక హెచ్చరిక
కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘ఫాంహౌస్‌ల నుంచి నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయి. దీంతో పేదల ఇళ్లు మునుగుతున్నాయి. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఆక్రమణలు వదిలి గౌరవంగా తప్పుకోండి. వాటిని కూల్చే బాధ్యత తీసుకుంటాం. కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా.. కోర్టుల్లో కొట్లాడతాం. హైదరాబాద్ కాలుష్యం నల్గొండకు చేరుతోంది. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తాం. ఇక్కడి పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయి. వారి పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుంది. మూసీ వెంట ఉన్న 11 వేల మంది బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తాం.