టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. 1937 డిసెంబర్ 28న నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. రతన్ టాటా న్యూయార్క్ కార్నల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పొందారు. 2000లో రతన్ టాటా భారత మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్, 2008లో రెండో అత్యున్న పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు.
రతన్ టాటా మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దయగల అసాధారణ వ్యక్తి. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారు’’అని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని కొనియాడారు.