తిరుమల లడ్డూ కల్తీ అంశంపై విచారణ వాయిదా పడింది. రేపు (అక్టోబర్ 4) 10.30 గంటలకు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. దర్యాఫ్తుపై అభిప్రాయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. లడ్డూ కల్తీ అంశంపై జస్టిస్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరపనుంది.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. కాగా, అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ మూడున్నర గంటలకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కేసు విచారణను రేపటికి వాయిదా వేయాలని కోరారు.
లడ్డూ అంశంపై ఎవరు దర్యాఫ్తు చేయాలి.. సిట్ చేయాలా? లేక స్వతంత్ర సంస్థ దర్యాఫ్తు చేయాలా? అన్న అంశానికి సంబంధించి కేంద్రం సలహాను కోరింది సుప్రీంకోర్టు. అయితే, కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. అందులో భాగంగానే.. ఇవాళ్టి కేసు విచారణను రేపు ఉదయం పదిన్నరకు వాయిదా వేయాలని కోరడం జరిగింది. అలాగే కోర్టు నెంబర్ 3లో వివిధ కేసుల విచారణ ఉదయం నుంచి కొనసాగుతోంది. వాటి విచారణ సుదీర్ఘ సమయం కొనసాగే అవకాశం ఉండటంతో లడ్డూ అంశంపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం వెల్లడించడం జరిగింది.
కోర్టు పర్యవేక్షణలో నిపుణుల ఆధ్వర్యంలో విచారణ జరపాలని పిటిషన్లు దాఖలు చేశారు. లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందా? కల్తీ నెయ్యితో వాటిని తయారు చేశారా? వాటిని వినియోగించారా? ఇటువంటి అంశాలపై దర్యాఫ్తు కోరుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర పిటిషనర్లు. రేపు దీనిపై ఒక స్పష్టం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.