తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఇవాళ తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.
దేవుడి దగ్గరకు వెళుతుంటే అడ్డుకునే కార్యక్రమాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. జగన్ తో పాటు వెళ్లేందుకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇది రాక్షస రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. వంద రోజుల ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో అనేక సార్లు తిరుమల వెళ్ళాను.. ఈ విషయం మీ అందరికి తెలుసు. శ్రీవారి దర్శనం చేసుకున్నాకే నా పాదయాత్ర ప్రారంభించా. పాదయాత్ర పూర్తయ్యాక కూడా స్వామి వారిని దర్శించుకున్నా. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి వస్త్రాలు సమర్పించాను. నా కులం, మతం గురించి ప్రజలందరికి తెలుసు. గుడికి వెళ్తే ఏ మతం అని అడగడం సరికాదు. మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతావారి పరిస్థితి ఏంటి? నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. బయటకు వెళ్తే.. హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తానని ఆయన పేర్కొన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం చాలా దౌర్భాగ్యం అని జగన్ పేర్కొన్నారు.