
పూరీ జగన్నాథ రథోత్సవం ప్రత్యేకతలతో నిండి ఉంది. మూడు రథాలలో ఊరేగే దేవతల విగ్రహాలు, వాటి నిర్మాణంలోని సంప్రదాయ విధానాలు ఈ వేడుక ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాయి.
Key Points
పూరీ జగన్నాథ రథోత్సవంలో మూడు రథాలు ఉంటాయి.
ప్రతి రథం కొత్తగా, సంప్రదాయ పద్ధతులతో తయారు చేస్తారు.
రథాల నిర్మాణంలో 1072 చెట్ల కాండలను ఉపయోగిస్తారు.
రథాలను లాగేందుకు 250 అడుగుల పొడవైన తాళ్లను ఉపయోగిస్తారు.
జగన్నాథ స్వామి రథం: ఘోష
అర్జునుడికి రథసారథిగా ముక్తిసాధనమైన గీతామృతాన్ని ఉపదేశించి, కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిన జగద్గురువు శ్రీ శ్రీకృష్ణభగవానుడు ‘శ్రీ జగన్నాథ స్వామి’ పేరుతో కొలువుదీరి, సంవత్సరానికి ఒకసారి రథం అధిరోహించి ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్న క్షేత్రం – పూరీ. ఈ క్షేత్రంలో జరిగే రథోత్సవం ఎన్నో ప్రత్యేకతలను స్వంతం చేసుకుని విరాజిల్లుతూ ఉంది. పూరీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్ష ద్వితీయనాడు రథోత్సవం జరుగుతుంది.
ఈ రథోత్సవానికి ‘మహావేది మహోత్సవం’ అని పేరు. సాధారణంగా దాదాపు అన్ని క్షేత్రాలలో బ్రహ్మోత్సవాలలో రథోత్సవంలో ఒకే రథం ఉంటుంది. అందులో ఉత్సవమూర్తులు రథం అధిరోహించి ఊరేగుతారు. అయితే, అందుకు భిన్నంగా పూరీలో మూలమూర్తులైన ముగ్గురు దేవతామూర్తులు వేర్వేరు రథాలలో అంటే మూడు రథాలలో ఊరేగుతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
రథోత్సవం కోసం ప్రతి సంవత్సరం నూతన రథాలను ఉపయోగిస్తారు. రథాల తయారీ కోసం గుర్తించిన వృక్షాలకు ముందుగా పూజలు చేసి, చెట్లను నరికి 1,072 చెట్ల కాండలను పూరీకి చేరుస్తారు. రథోత్సవానికి రెండు నెలల ముందు అక్షయ తృతీయ నాడు రథాలను తయారుచేసే పనిని ప్రారంభిస్తారు. తయారీలో 120 మంది పాల్గొంటారు. సంప్రదాయ పనిముట్లతోనే రథాలను తయారు చేస్తారు. రథాల తయారీలో ఎటువంటి యంత్రాలను ఉపయోగించరు.
1,072 దుంగలను 2,188 ముక్కలుగా చేస్తారు. అందులో 832 చెక్క ముక్కలను ఉపయోగించి, 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తున్న జగన్నాథ స్వామి రథాన్ని చేస్తారు. ఈ రథానికి ‘ఘోష’, ‘గరుడధ్వజ’ అని పేర్లు. 763 చెక్కముక్కలతో, 14 చక్రాలు ఉన్న, 44 అడుగుల ఎత్తున్న ‘తాళధ్వజ’ అనే బలభద్రుడి రథాన్ని చేస్తారు. 593 చెక్కముక్కలతో, 12 చక్రాలతో, 43 అడుగుల ఎత్తున్న సుభద్ర రథాన్ని తయారు చేస్తారు. ఈ రథానికి ‘దర్పదళన’, ‘పద్మధ్వజ’ అని పేర్లు. ఈ రథాలను లాగేందుకు 250 అడుగుల పొడవైన తాళ్లను కడతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బలభద్రుడు రథం: తాళధ్వజ
రథోత్సవానికి 15 రోజుల ముందు జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున దేవతామూర్తులకు 108 బిందెల నీటితో స్నానం చేయిస్తారు. అందువల్ల స్వామివారు అనారోగ్యం పాలవుతారు. అందువల్ల 15 రోజుల పాటు ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తారు. ప్రతిరోజూ 56 రకాల నైవేద్యాలను సమర్పించే స్వామివారికి ఈ రోజులలో పథ్యం. కనుక కందమూలాలు, పండ్లను మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత ఆషాఢ శుక్లపక్ష పాడ్యమినాడు స్వామివారికి నేత్రోత్సవం జరిపి దర్శనాలకు అనుమతిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
రథోత్సవం నాడు, అంటే ఆషాఢ శుక్లపక్ష ద్వితీయనాడు, రథాలను ఆలయ సింహద్వారానికి ఎదురుగా తీసుకువస్తారు. అర్చకులు ఉదయకాల పూజల అనంతరం ‘మనిమా’ అంటే ‘జగన్నాథా’ అంటూ నినాదాలు చేస్తూ, గర్భాలయం నుంచి దేవతామూర్తులను తీసుకువచ్చి రథాలలోని రత్నపీఠంపై కొలువుదీరుస్తారు. ఈ ఉత్సవాన్ని ‘పహండీ’ అని పిలుస్తారు. ఈ విధంగా దేవతామూర్తులు కొలువుదీరిన తర్వాత, పురీ రాజు పల్లకీలో రథాల వద్దకు చేరుకొని బంగారు చీపురుతో రథాల లోపలి భాగాలను ఊడుస్తారు. అనంతరం రథయాత్ర ప్రారంభమవుతుంది.
‘గుండీచా’ మందిరానికి ఘోష రథయాత్ర
సుభద్ర రథం: దర్పదళన
రథయాత్రలో మూడు రథాలు ఒకే వరుసలో పక్క పక్కనే ఉన్నట్లు ఉన్నా, ముందుగా బలభద్రుడి రథం, దానికి కొంత వెనుక సుభద్ర రథం, దానికి కొంత వెనుక జగన్నాథుడి రథం ముందుకు కదులుతాయి. ‘బడోదండో’ అని పిలువబడే ప్రధాన రహదారిలో రథయాత్ర సాగుతుంది. మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ‘గుండీచా’ మందిరానికి రథయాత్ర చేరుతుంది. ఈ యాత్ర సుమారు 12 గంటలు సాగుతుంది. ఈ యాత్ర కు ‘ఘోష రథయాత్ర’ అని పేరు. గుండీచా అమ్మవారు జగన్నాథుడి పెంపుడు తల్లి అని చెబుతారు. అక్కడ తొమ్మిది రోజులు గడిపి, తొమ్మిదవ రోజు రథయాత్ర తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
తొమ్మిదవ రోజు తిరుగు ప్రయాణం. ఈ రథయాత్రకు ‘బహుదా యాత్ర’ అని పేరు. మార్గమధ్యంలో ‘మౌసీమ’ ఆలయం వద్ద స్వామివారు ఆగి, ‘అర్థాసనీ దేవి’ సమర్పించే నివేదనను స్వీకరించి, మధ్యాహ్నానికి ఆలయం చేరుకోవడం తో రథయాత్ర ముగుస్తుంది. అర్థాసనీ దేవి స్వామివారి పినతల్లి అని చెబుతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000
పూరీ జగన్నాథ రథోత్సవం భారతీయ సంస్కృతిలో ఒక ప్రముఖమైన వేడుక. ఈ రథాల నిర్మాణం, ఆచారాలు మనకు మత, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుచేస్తాయి.


