
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయి. ఇటీవల ఈ సినిమా రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా, రామ్ గోపాల్ వర్మ సినిమా విశేషాలను వెల్లడించారు. నాగార్జునతో సినిమా కోసం ఏఎన్నార్‌ను ఎలా ఒప్పించడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో వివరించారు.
Key Points
1989లో విడుదలైన ‘శివ’ రామ్ గోపాల్ వర్మకు దర్శకుడిగా, నాగార్జునకు హీరోగా బ్రేక్ ఇచ్చింది.
36 ఏళ్ల తర్వాత నవంబర్ 14న ‘శివ’ సినిమా రీ రిలీజ్ కానుంది.
శివ సినిమాను పూర్తి చేయడానికి రామ్ గోపాల్ వర్మ ఎన్నో సవాళ్లు, ఆటంకాలు ఎదుర్కొన్నారు.
ప్రాజెక్ట్ కోసం ఏఎన్నార్, నాగార్జునలను ఒప్పించడానికి వర్మ 1000 అబద్ధాలు ఆడాడు.
శివ: ఒక కల్ట్ క్లాసిక్ పునర్జన్మ
టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన సినిమా ‘శివ’. 1989లో విడుదలైన ఈ సినిమా రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేయడమే కాకుండా, హీరో నాగార్జున కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ఆయన సినిమా జీవితాన్ని ఈ సినిమా మలుపు తిప్పింది. 36 ఏళ్లు అవుతున్నాా.. శివ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 14న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈసినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
శివ సినిమా కంప్లీట్ చేయడంలో ఎన్నో సవాళ్లను ఫేస్ చేశారు వర్మ. ఈ సినిమా వల్ల వచ్చిన అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అన్నారు వర్మ. ఆర్జీవి మాట్లాడుతూ, “చాలామంది జీవితంలో ఎదిగాక, తమ కెరీర్ మొదట్లో ఎదురైన అవమానాలను గుర్తుచేసుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు.. అప్పటికి మనం ఏ స్థాయిలో లేమో, మనల్ని గుర్తించకపోవడం వాళ్ల తప్పు కాదు. మనం ఆ స్థాయికి చేరుకోకపోవడమే మన తప్పు అని నేను నమ్ముతాను. శివ సినిమా సెట్స్ ఎక్కించే క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతి దశలో ఏదో ఒక సమస్య వెంటాడేది.. ఆ సవాళ్లు దాటుకుంటూ సినిమాను కంప్లీట్ చేశాను ” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.
ఆర్జీవీ సవాళ్లు, 1000 అబద్ధాల వెనుక కథ
వర్మ మాట్లాడుతూ.. “శివ సినిమా చేజారకుండా చాలా జాగ్రత్త పడ్డాను. నాగార్జున ఈ సినిమా చేయడానికి ఓప్పుకున్నప్పటికీ.. ఆయన తండ్రి నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చని అనిపించింది. అలాగే నిర్మాతగా వెంకట్ గారిని కూడా ఒప్పించాల్సిన అవసరం కూడా వచ్చింది. దాంతో ఈ ముగ్గురికీ దగ్గరవడం, నాపై నమ్మకం పెంచుకోవడం చాలా అవసరమైంది. వారిని అర్థం చేసుకోవడం, నా ఆలోచనలపై విశ్వాసం కలిగించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. అదే సమయంలో, వారి వైపు నుంచి వేరే ప్రాజెక్టులు మధ్యలో అడ్డుపడకుండా చూసుకోడానికి చాలా మాయ చేయాల్సి వచ్చింది ” అని వర్మ అన్నారు.
నాగార్జున, ఏఎన్నార్ లను వర్మ ఎలా ఒప్పించాడు?
ఆర్జీవి మాట్లాడుతూ.. “‘శివ’ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకూ.. ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ ప్రాజెక్ట్ కోసం నేను 1000 అబద్ధాలు ఆడవలసి వచ్చింది. కొన్నిసార్లు కొంత కుట్రలు కూడా చేయాల్సి వచ్చింది. కానీ చివరికి ఆ కష్టం ఫలించింది. శివ సినిమా విడుదలైన తర్వాత అందరి దృష్టిలో నేను దర్శకుడిగా నిలబడ్డాను. ఈ సినిమా కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదు, ఆ కాలంలో యువతలో ఉన్న కోపం, తిరుగుబాటు మనస్తత్వాన్ని ఈసినిమాలో చూపించాను. అందుకే శివ మూవీ ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయింది,” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.
రామ్ గోపాల్ వర్మ ఎన్ని అబద్ధాలు చెప్పి, ఎన్ని సవాళ్లను దాటినా, చివరికి ‘శివ’ సినిమా సంచలన విజయం సాధించింది. ఇది దర్శకుడిగా వర్మను నిలబెట్టడమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.


