
📌 Key Points
- సంక్రాంతి సినిమాల్లో కామెడీ ప్రధానం, కథలో కొత్తదనం ముఖ్యం.
- కొన్ని సంక్రాంతి సినిమాలు కామెడీపైనే దృష్టి పెట్టి కథను విస్మరించాయి.
- మారుతి, అనిల్ రావిపూడి, కిషోర్ తిరుమల సినిమాలపై విమర్శలు.
- పాత కథలు, ప్రస్తుత జనరేషన్‌కు కనెక్ట్ కాని అంశాలు ఉన్నాయని విమర్శలు.
సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే సినిమాల్లో కామెడీ ముఖ్యమైన అంశం. అయితే, కొన్ని సినిమాలు కేవలం కామెడీపైనే దృష్టి పెట్టి, కథను విస్మరించడం వలన ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
కామెడీ ప్రధానం కాదా?
Sankranti 2026 Movies : సంక్రాంతి అంటే తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు వచ్చే పండుగ సీజన్. అందుకే ఈ సమయంలో విడుదలయ్యే సినిమాల్లో కామెడీ చాలా కీలకం. కానీ కామెడీ మాత్రమే ఉంటే సరిపోదు. కొత్తదనం ఉన్న కథ..ఆసక్తిగా నడిచే స్క్రీన్‌ప్లే కూడా ఉండాలి. ఈ సంక్రాంతికి వచ్చిన కొన్ని సినిమాల్లో అదే పెద్ద లోపంగా మారింది.
ఇప్పటివరకు విడుదలైన మూడు సినిమాలు.. ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి .. అన్నింటిలో ఒకే సమస్య కనిపిస్తోంది. కామెడీ మీద మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టి, కథను.. కథనాన్ని దర్శకులు పక్కన పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాల దర్శకులు మారుతి, అనిల్ రావిపూడి, కిషోర్ తిరుమల. మారుతి గతంలో కొంచెం బీ-గ్రేడ్ టచ్ ఉన్న సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. అందుకే ది రాజా సాబ్ సినిమాలో కూడా మూడు హీరోయిన్లు ఉండట.. హీరో ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కమిట్ అయినట్టు చూపించడం చూసి ..ఇది మారుతి స్టైల్.. అనుకునే వాళ్లు ఉన్నారు.
దర్శకులపై విమర్శలు
కానీ ఆశ్చర్యం ఏంటంటే… ఇలాంటి కాన్సెప్ట్‌లను కేవలం మారుతి మాత్రమే కాదు.. కిషోర్ తిరుమల..అనిల్ రావిపూడి లాంటి దర్శకులు కూడా ఫాలో అవడం. గతంలో అమ్మాయిలను గౌరవంగా.. బలమైన పాత్రలుగా చూపించిన ఈ ఇద్దరు దర్శకులు కూడా ఈసారి పాత ఆలోచనల కథలను తీసుకురావడం ప్రేక్షకులను నిరాశపరిచింది.
ముఖ్యంగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో భార్యను భర్త కొట్టడం.. విడిపోవడం..చివరికి భార్యే అర్థం చేసుకుని భర్త దగ్గరికి రావడం చూపించారు. ఇవన్నీ ఇప్పటి జనరేషన్‌కు అస్సలు కనెక్ట్ కావు. అలాగే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో భర్త మరో అమ్మాయితో కమిట్ అయినా.. కూడా చివరికి భార్య అతనితోనే కలవడం చూపించడం కూడా విమర్శలకు దారి తీస్తోంది.
ఈ లోపాలన్నింటిని కప్పిపుచ్చేందుకు దర్శకులు కామెడీని ఆయుధంగా వాడారు. హీరోల ఎనర్జీ, పంచ్ డైలాగ్స్‌తో సినిమాలను నడిపించే ప్రయత్నం చేశారు. కానీ బలమైన కథ లేకపోతే కామెడీ కూడా ఎక్కువ కాలం పనిచేయదు.
కథ లేకుంటే కష్టమే!
సంక్రాంతి సినిమాలకు నవ్వు అవసరం… కానీ ఆ నవ్వుకు అర్థం ఉన్న కథ..ప్రస్తుత జనరేషన్ ఆలోచనలకు సరిపోయే కంటెంట్ తోడైతేనే నిజమైన విజయం సాధ్యమవుతుంది.
ఇక ఈ సంక్రాంతికి రెండు సినిమాలు మిగిలి ఉన్నాయి. ఒకటి అనగనగా ఒక రాజు కాగా మరొకటి నారీ నారీ నడుమ మురారి.. మరి కనీసం ఈ రెండు చిత్రాలైన కామెడీతో పాటు కథని కూడా నమ్ముకుంటాయా.. లేదా ఈ మూడు చిత్రాల లానే నవ్వులు పండిస్తూ నవ్వుల పాలవుతాయా చూడాలి.
సంక్రాంతి సినిమాలకు నవ్వులు అవసరమే కానీ, బలమైన కథ, ప్రస్తుత జనరేషన్ ఆలోచనలకు తగ్గ కంటెంట్ ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. మిగిలిన సినిమాలైనా ఆకట్టుకుంటాయో లేదో చూడాలి.


