
📌 Key Points
- వేలాది మంది SBI క్రెడిట్ కార్డు యూజర్లకు సిబిల్ స్కోర్ తగ్గింది.
- బిల్లులు సకాలంలో చెల్లించినా ‘ఓవర్ డ్యూ’గా చూపించింది.
- సాంకేతిక లోపమే కారణమని SBI కార్డ్స్ అంగీకరించింది.
- త్వరలో సిబిల్ స్కోర్‌ను యథాస్థితికి తెస్తామని హామీ ఇచ్చింది.
SBI క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. బిల్లులు సకాలంలో చెల్లించినప్పటికీ, వారి సిబిల్ స్కోర్‌లు భారీగా పడిపోయాయి. సాంకేతిక లోపమే దీనికి కారణమని SBI కార్డ్స్ అంగీకరించింది. ఈ పరిణామం వేలాది మంది కస్టమర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది.
బిల్లు కట్టినా సిబిల్ స్కోర్ పతనం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ వాడుతున్న వేలాది మంది కస్టమర్లు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్రెడిట్ కార్డ్ పెండింగ్ బిల్లులను గడువు లోపలే పూర్తిగా చెల్లించినప్పటికీ జులై నెల క్రెడిట్ రిపోర్టులో ‘ఓవర్ డ్యూ’ (Overdue) ఉన్నట్లుగా చూపిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో కస్టమర్ల సిబిల్ స్కోర్ (CIBIL Score) ఒక్కసారిగా పడిపోవడంతో యూజర్లు సోషల్ మీడియా వేదికగా లబోదిబోమంటున్నారు.
కారణం ఏంటి? SBI వివరణ
అయితే, సాధారణంగా క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. కానీ, ఇక్కడ కస్టమర్లు తాము రూపాయి కూడా బాకీ లేకుండా మొత్తం బిల్లు క్లియర్ చేశామని ఆధారాలతో సహా ‘X’ (ట్విట్టర్) వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ బ్యాంక్ నుంచి తప్పుడు డేటా సిబిల్‌కు వెళ్లడం వల్ల చాలా మంది యూజర్లకు 50 నుంచి 70 పాయింట్ల వరకు సిబిల్ స్కోర్ హఠాత్తుగా తగ్గిపోయింది. దీంతో భవిష్యత్తులో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు తీసుకోవాలనుకునే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.
యూజర్ల ఆందోళన, భవిష్యత్తుపై ప్రభావం
కాగా, టెక్నికల్ ఇష్యూపై కస్టమర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తుండటంతో ఎస్బీఐ కార్డ్స్ స్పందించింది. డేటా అప్‌డేట్ కావడంలో ఏదో పొరపాటు జరిగిందని, ఈ సమస్యపై ప్రస్తుతం అంతర్గతంగా రివ్యూ జరుపుతున్నామని బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే సాంకేతిక లోపాన్ని సరిచేసి, కస్టమర్ల సిబిల్ స్కోర్‌ను యథాస్థితికి తీసుకువస్తామని ఎస్‌బీఐ కార్డ్స్ వర్గాలు తెలిపాయి.
ఈ సాంకేతిక లోపం వల్ల కస్టమర్ల భవిష్యత్ రుణాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. SBI కార్డ్స్ త్వరగా సమస్యను పరిష్కరించి, యూజర్ల సిబిల్ స్కోర్‌లను పునరుద్ధరించాలని వేలాది మంది కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు.


