
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, కథలో స్పెర్మ్ కౌంట్ సమస్య ఉండటంతో కొందరు పేరున్న హీరోలు నో చెప్పారని తెలిపారు.
Key Points
'సంతాన ప్రాప్తిరస్తు' స్క్రిప్ట్‌ను స్పెర్మ్ కౌంట్ సమస్య కారణంగా కొందరు పేరున్న హీరోలు తిరస్కరించారు.
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.
మేల్ ఫెర్టిలిటీ సమస్యతో బాధపడేవారికి సినిమా ధైర్యాన్నిస్తుందని నిర్మాత శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.
కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచులు, ఓటీటీ డీల్స్‌లో మార్పులు వచ్చాయని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
సంతాన ప్రాప్తిరస్తు కథ: స్టార్ హీరోలు ఎందుకు నో చెప్పారు?
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu Movie). సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్‌పై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ–‘‘సంతాన ప్రాప్తిరస్తు’ స్క్రిప్ట్‌ని కొందరు పేరున్న హీరోలకు వినిపించాం. కథలో హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత తమ ఇమేజ్‌కు ఇబ్బంది అవుతుందంటూ నో చెప్పారు. కొత్త అబ్బాయితో వెళితే ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్‌ను తీసుకున్నాం. మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సాగే ఈ సినిమాలో ఎక్కడా అభ్యంతరకరమైన డైలాగ్స్ లేవు. మా సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది.
ఫెర్టిలిటీ సమస్యపై అవగాహన, ప్రేక్షకులకు ధైర్యం
కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయి. నాలుగేళ్ల క్రితం అయితే ఈ సినిమా ట్రైలర్‌ను మా కుటుంబ సభ్యులకే చూపించలేకపోయేవాడిని. ఇప్పుడు మా అబ్బాయిలు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడగలుగుతున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో ‘సంతానప్రాప్తిరస్తు 2’ చేయాలనుకుంటున్నాం.
మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, ఓటీటీ డీల్స్
మన నేటివ్ సినిమాల్లో కంటెంట్ బాగుంటే అదే గ్లోబల్ స్థాయికి వెళ్తుంది. పాఇండియా అవుతుంది. కరోనా తర్వాత ఓటీటీ డీల్స్ విషయంలో మార్పులు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల పేమెంట్స్ తగ్గిస్తున్నారు. భవిష్యత్‌లో నా దర్శకత్వంలో మళ్లీ సినిమా ఉండొచ్చు. కొత్త ఫిల్మ్‌మేకర్స్ మా మధుర ఆడియో పాటలను వినియోగించుకుంటే నేను డబ్బులు చార్జ్ చేయడం లేదు’’ అని అన్నారు. నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ–‘‘ఐటీ రంగం నుంచి వచ్చిన నేను ‘సంతాన ప్రాప్తిరస్తు’ తో నిర్మాతగా పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.
‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, మేల్ ఫెర్టిలిటీ సమస్యపై సామాజిక స్పృహను పెంపొందించే ప్రయత్నం చేస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. విక్రాంత్ నటన, కొత్తదనం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లు.


