
📌 Key Points
- హోటళ్లకు ఎల్పీజీ సరఫరా నిలిస్తే 60% హోటళ్లు మూతపడే ప్రమాదం ఉంది.
- ఎల్పీజీ సరఫరా సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది.
- హైదరాబాద్‌లో 20,000 హోటళ్లు, తెలంగాణ వ్యాప్తంగా 40,000-50,000 రెస్టారెంట్లు ఉన్నాయి.
- గృహ, వాణిజ్య అవసరాలకు ఎల్పీజీ సరఫరా సాధారణంగానే ఉందని పౌర సరఫరాల శాఖ తెలిపింది.
తెలంగాణలోని హోటల్స్ ఎల్పీజీ సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ హోటల్స్ అసోసియేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసింది. సరఫరా ఆగిపోతే హోటల్స్ మూతపడే ప్రమాదం ఉంది.
హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఎల్పీజీ గ్యాస్ ధరలపై ఉన్న నిబంధనలను హోటళ్ల వరకు తగ్గించాలని కోరింది. హోటళ్లను అత్యవసర సేవల కింద పరిగణించాలని పేర్కొంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు హోటళ్లు, రెస్టారెంట్లకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి మంత్రి ఉత్తమ్ జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ కోరింది. తెలంగాణ టూరిజం, హాస్పటాలిటీ, సేవల్లో హోటళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేసింది.
కమర్షియల్ ఎల్పీజీతో తెలంగాణలోని హోటళ్ల యజమానులు తమ కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా ఆలస్యం అయితే, ఒకటి లేదా రెండు రోజుల్లో రాష్ట్రంలో 60 శాతం కంటే ఎక్కువ హోటళ్ల కార్యకలాపాలను మూసివేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
‘ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా అందుబాటులోకి రాకపోతే ఒకటి లేదా రెండు రోజుల్లో 60 శాతానికి పైగా హోటళ్లు మూసివేయాల్సి వస్తుంది.’ అని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి అన్నారు. తగినంత స్టాక్‌లు ఉన్న పెద్ద హోటళ్లు ఒక వారానికి సరిపడా నిర్వహించగలవు. కానీ చిన్నవి రెండు రోజుల్లోనే మూసివేయవలసి రావచ్చని చెప్పారు.
ఎల్పీజీ సరఫరాలో అంతరాయం?
తెలంగాణ అంతటా 40,000-50,000 రెస్టారెంట్లు ఉన్నాయని, వాటిలో హైదరాబాద్‌లోని 20,000 హోటళ్లు ఉన్నాయని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హోటళ్ల క్లోజ్ అయితే.. కేవలం టూరిస్టులు, ట్రావెలర్స్ మీద మాత్రమే కాకుండా వర్కర్స్, ఉద్యోగులు, విద్యార్థుల మీద కూడా ప్రభావం పడుతుందన్నారు.
మరోవైపు తెలంగాణలో గృహ, వాణిజ్య రంగాలకు ఎల్పీజీ వంట గ్యాస్ సరఫరా సాధారణంగానే ఉందని పౌర సరఫరాల శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఎల్‌పీజీ సిలిండర్లను నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పీటీఐతో మాట్లాడారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజుకు 2.3 లక్షల సిలిండర్లను సరఫరా చేస్తున్నాయని, ప్రజలు భయపడవద్దని కోరారు. ఎల్‌పీజీ సిలిండర్లలో 86 శాతం గృహ రంగానికి ఉద్దేశించగా, మిగిలినవి వాణిజ్య సంస్థలకు వెళ్తాయి.
పౌర సరఫరాల శాఖ స్పందన
పశ్చిమాసియాలో సంఘర్షణల మధ్య గృహ, వాణిజ్య రంగాలకు ఎల్పీజీ వంట గ్యాస్ సరఫరాలో ఏదైనా అంతరాయం ఏర్పడిందా? అని అడిగినప్పుడు ‘పరిస్థితులు సజావుగా జరుగుతున్నాయి. ప్రజలు భయపడకూడదు. ప్రస్తుతం పరిస్థితి సౌకర్యంగా ఉంది.’ అని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారతదేశానికి ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడింది. ప్రభుత్వం గృహ వంట గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇచ్చింది. దీని ఫలితంగా వాణిజ్య ఎల్పీజీని ఉపయోగించే హోటళ్ళు, రెస్టారెంట్లకు సరఫరా సంక్షోభం ఏర్పడింది.
రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా సాధారణంగానే ఉందని పౌర సరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, హోటల్స్ అసోసియేషన్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.


