
📌 Key Points
- తెలంగాణ పల్లెల్లో MGNREGS పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి.
- మంత్రి సీతక్క సమీక్షలతో కూలీల హాజరు 7 లక్షల నుండి 16.24 లక్షలకు పెరిగింది.
- వికారాబాద్, నల్గొండ వంటి జిల్లాలు ఉపాధి హామీ అమలులో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి.
- గద్వాల్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో హాజరు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను దించింది.
తెలంగాణ పల్లెల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు వేగంగా సాగుతున్నాయి. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో కూలీల హాజరు గణనీయంగా పెరిగింది. పని దినాల పూర్తిపై ప్రభుత్వం దృష్టి సారించి, వెనుకబడిన జిల్లాల్లోనూ పనులు పెంచేందుకు కృషి చేస్తోంది.
మంత్రి సీతక్క చొరవతో ఉపాధి పనులకు ఊపు
MGNREGS Works in Telangana : రాష్ట్రంలోని పల్లెల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రస్తుతం అత్యంత వేగంగా…. జోరుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) వరుస క్షేత్రస్థాయి సమీక్షలు, ప్రత్యేక చొరవతో ఉపాధి పనుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ నిరంతరం రంగంలోకి దిగారు. వీరు ప్రతిరోజూ అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు… మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పనులను పటిష్టంగా సమీక్షిస్తున్నారు.
మే నెల ప్రారంభంలో రాష్ట్రంలో మండుతున్న ఎండలు తీవ్రంగా ఉండటం, మొబైల్ ఫోన్ ద్వారా లైవ్ ఫొటోలు తీసే ‘మొబైల్ ఫోటో క్యాప్చరింగ్’ విధానంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కూలీలు ఉపాధి పనులకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో రోజుకు కనీసం లక్ష మంది కూలీలు కూడా పనులకు రావడం గగనమైంది.
ఈ సంక్షోభ పరిస్థితులపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి పెట్టారు. వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులను పరుగులు పెట్టించడంతో పాటు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టారు. దీని ఫలితంగా మే మొదటి వారంలో కేవలం 7 లక్షల పరిధిలో ఉన్న కూలీల హాజరు…. క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఏకంగా 16.24 లక్షలకు చేరింది. ఏ గ్రామంలోనూ పని లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో తక్కువ హాజరు ఉన్న మండలాలను గుర్తించి, గ్రామాల వారీగా ప్రత్యేక ఇంచార్జ్‌లను సైతం నియమించారు.
ప్రభుత్వ సమీక్షల్లో కొన్ని జిల్లాలు ఉపాధి హామీ అమలులో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. వికార్‌బాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, రాజన్న సిరిసిల్లా జిల్లాలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో 1.23 లక్షల మందికి పైగా కూలీలు పనులకు హాజరవుతుండటం విశేషం. ఇదే సమయంలో కూలీల సంఖ్య కాస్త తక్కువగా నమోదువుతున్న గద్వాల్, రంగారెడ్డి, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ జిల్లాల్లో కూలీల హాజరును పెంచేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
కూలీల హాజరులో రికార్డు స్థాయి పెరుగుదల
మరోవైపు కేంద్రం నుంచి నిధులు విడుదల కావడంతో ప్రస్తుతం వేతనాల పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా, సకాలంలో కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.
“ఈ రోజు మనం చేస్తున్న ఉపాధి హామీ పనులు రేపటి తెలంగాణకు నీటి భద్రత కల్పించాలి. చెరువులు నిండితేనే రైతు బలపడతాడు, భూగర్భ జలాలు పెరిగితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో ప్రస్తుతం పల్లెల్లో నీటి సంరక్షణ పనులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. చెరువులు, ఊటకుంటలు, పంట కాలువలలో పూడికతీత పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రతి గ్రామంలో కనీసం మూడు నీటి సంరక్షణ పనులను తప్పనిసరిగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
వెనుకబడిన జిల్లాలపై సర్కార్ ప్రత్యేక దృష్టి
రాబోయే జూలై 1 నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. ఈ నేపథ్యంలో…. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 8 కోట్ల పని దినాల (Work Days) లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 4.5 కోట్ల పని దినాలు పూర్తి కాగా…. మరో 3.5 కోట్ల పని దినాల లక్ష్యం మిగిలి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న రోజువారీ 16 లక్షల మంది హాజరును ఇలాగే కొనసాగిస్తే అనుకున్న సమయానికి లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంటామని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మంత్రి సీతక్క చొరవతో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. కూలీల హాజరు పెరిగి, వేతనాలు సకాలంలో అందుతుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ఊతం. అన్ని జిల్లాల్లో పనులు మరింత విస్తరించనున్నాయి.


