ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించిన స్థలం పట్టా కలిగిన డాక్యుమెంటెడ్ భూమి అని స్పష్టం చేశారు. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదని తెలిపారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ 24 ఫిబ్రవరి 2014న ఒక ఆర్డర్ ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందని నాగార్జున వివరించారు.
ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించామని, న్యాయస్థానం తీర్పునకు తాను కట్టుబడి ఉంటానని అభిమానులు, శ్రేయోభిలాషులకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని సవినయంగా అభ్యర్థిస్తున్నానని తెలిపారు.
ఎన్ కన్వెన్షన్ నేలమట్టం : నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా శనివారం కూల్చేసిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు స్పందించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఈ కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ మేరకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సమగ్ర వివరణ ఇచ్చారు.
తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణలను హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగినేషన్, రెవెన్యూ శాఖ అధికారులు తొలగించినట్లు పేర్కొన్నారు. తొలగించిన అనేక నిర్మాణాల్లో అనధికారిక నిర్మాణంగా ఉన్న ఎన్ కన్వెన్షన్ ఒకటని రంగనాథ్ తెలిపారు. 2014లో హెచ్ఎండీఏ తుమ్మిడికుంట చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం, బఫర్ జోన్లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిందని, 2016లో తుది నోటీఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.
2014లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి చట్టబద్దమైన ప్రక్రియను అనుసరించాలని హైకోర్టు ఎన్ కన్వెన్షన్‌ను ఆదేశించిందని, ఆ ప్రకారం ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం సమక్షంలోనే ఎఫ్టీఎల్ సర్వే జరిగినట్లు తెలిపారు. ఆ సర్వే నివేదికపై 2017లో ఎన్ కన్వెన్షన్ మియాపూర్ అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించిందని, ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందే తప్ప ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు.