అనారోగ్య కారణాలతో గత కొంత కాలంగా సినిమాల్లో తన వేగం తగ్గించిన కథానాయిక సమంత, ప్రస్తుతం పూర్తిగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. ఇప్పటివరకు తెలుగులో ఆమె ఏ సినిమా అంగీకరించలేదు, కానీ తాజా సమాచారం ప్రకారం, సమంత త్వరలో ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత, ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు ఇద్దరు హీరోయిన్లు జోడిగా కనిపించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్‌గా ఇమాన్వి ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్‌గా సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇప్పటి వరకు ప్రభాస్-సమంత జంటగా కలిసి సినిమా చేయలేదు, కాబట్టి ఈ కొత్త జంటను ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత కూడా పెద్ద హీరోతో నటించడం చాలా కాలం తర్వాత అవుతుండటంతో, ఈ ప్రాజెక్టుకు దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.