పోలీస్ ఉద్యోగం అంటే కత్తిమీద సాములా ఉంటుందని చాలామంది నమ్మకం. ముఖ్యంగా, నిబద్ధతతో పనిచేసే అధికారులపై ఎక్కడి నుంచి, ఎప్పుడు శత్రువులు దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. బెదిరింపులు, బదిలీలు, దాడులు లాంటి ప్రమాదాలు ఉన్నప్పటికీ, ఎలాంటి భయం లేకుండా వారు ముందుకు సాగాల్సి ఉంటుంది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) టాస్క్‌ఫోర్స్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, గంజాయి రవాణాను అడ్డుకోవడం వంటి చర్యలు తీసుకున్న రంగనాథ్‌పై, సుపారీ గ్యాంగ్‌లతో కలిసి దాడి చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన విధి నిర్వహణలో ఎవరినీ లెక్క చేయకుండా, న్యాయబద్ధంగా ముందుకు సాగుతారని ప్రజల్లో విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని గుర్తించి, రంగనాథ్ బాధ్యతలను మరింత పదునుగా తీర్చిదిద్దారు. అయితే, కొందరు ప్రతిష్టత్మక వ్యక్తులు, రాజకీయ నాయకులు ఈ చర్యలను ఎదుర్కోవడానికి కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, రంగనాథ్ భద్రతను పెంచాలని ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా, ప్రజలు కూడా ఇలాంటి అధికారులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.