టాలీవుడ్ స్టార్ హీరో, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇవాళ (సెప్టెంబర్ 2న) తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, జనసైనికులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు జన్మదినం సందర్భంగా పవన్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఈ రోజుల్లో పవన్ లాంటి నాయకుడు కావాలని, అద్భుతాలు జరగాలని పవర్ స్టార్ మాత్రమే చేయగలరని చిరంజీవి తాజా పోస్ట్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.
“ప్రియమైన కళ్యాణ్ బాబు… ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం.
ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు… దీర్ఘాయుష్మాన్ భవ!” నా తమ్ముడైనందుకు గర్విస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. ఈ పోస్టుకు ఓ ప్రత్యేక ఫొటోను చిరంజీవి షేర్ చేశారు. ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.