సినీ పరిశ్రమలో ఎన్నో గొప్ప హీరోయిన్లు ఉన్నప్పటికీ, ప్రతిసారి ఆపద వచ్చినప్పుడు పక్కవారికి సహాయం చేయాలని భావించడం నిజమైన గొప్పతనం. అనన్య నాగళ్ల అనే చిన్న స్థాయి నటి దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం వంటి ప్రాంతాలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇలాంటి విపత్తులో అనన్య నాగళ్ల రెండు రాష్ట్రాల బాధితుల సహాయార్థం రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆమె చేసిన ఈ సహాయం చిన్నది అయినా, ఆ మనసు మాత్రం గొప్పది.
అనన్య చేసిన ఈ సాయాన్ని చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. ఆమె చేసిన సహాయాన్ని ప్రశంసిస్తూ, మీ చేయూత బాధితులకు బలాన్నిస్తుంది అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్, అనన్య నాగళ్ల “వకీల్ సాబ్” సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే, పవన్ కల్యాణ్ అనన్య నాగళ్లను తన సినిమాలో నటించిందని గుర్తు చేసుకొని ప్రశంసించలేదు. సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్లలో ఒకే ఒక్క అమ్మాయి విరాళం ఇచ్చిందని తెలుసుకొని ఆమెను అభినందించారు.
ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు తీసుకునే స్టార్ హీరోయిన్లు ముందుకు రాకపోయినా, అనన్య ఇలా మంచి మనసుతో సాయం చేయడం నిజంగా అభినందనీయం. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌కు అనన్య స్పందిస్తూ, “థాంక్యూ సో మచ్ సర్, మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తిదాయకం” అని ట్వీట్ చేసింది.
నెటిజన్లు మరియు ప్రజలు ఇప్పుడు పెద్ద హీరోయిన్లను చూసి, వారు కూడా తమ వంతు సాయం చేయాలని సూచిస్తున్నారు.