తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మహాప్రసాదం కల్తీ ఘటనపై ఎక్స్ వేదికగా తొలుత తన అభిప్రాయాన్ని పంచుకున్న నటుడు ప్రకాశ్ రాజ్.. ఆ తరువాత నుంచి వరుస పోస్టులు పెడుతున్నారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ల్యాబ్ రిపోర్టులు రావడంతో పవన్ కల్యాణ్ లడ్డూ వివాదంపై తొలుత ట్వీట్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. దోషులకు శిక్షపడాలనే ఉద్దేశంతో ట్వీట్ లో పేర్కొన్నారు. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిస్తూ మత పరమైన ఉద్రిక్తతలు చాలు కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నాడు. ప్రకాశ్ రాజ్ పోస్టుపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రకాశ్ రాజ్ మీకు ఏం కావాలి.. సున్నితాంశాలపై తెలుసుకొని మాట్లాడాలని పవన్ హితవు పలికారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. ఆ తరువాత ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ఎక్స్ వేదికగా పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానంటూ పేర్కొన్నారు.
గురువారం ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతావరం.. గెలిచిన తరువాత ఇంకో అవతారం.. ఏంటీ అవాతారం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్.. అంటూ పేర్కొన్నాడు. తాజాగా శుక్రవారం ఉదయంసైతం మరో ట్వీట్ చేశారు. మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి.. తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నాడు. అయితే, ఆయన ఈ రెండు పోస్టుల్లోనూ ఎవరు పేరును ప్రస్తావించలేదు.. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి పోస్టు పెట్టారు? ఎందుకు పెట్టారు.. అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. తిరుపతి లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్షపడాలనే ఉద్దేశంతో నేను పోస్టు పెట్టా. కానీ ప్రకాశ్ రాజ్ ఢిల్లీలో మీ స్నేహితులంటూ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పోస్టును నేను తప్పుగా ఏమీ అర్ధం చేసుకోలేదు.. నాకు ఆయన ఉద్దేశం అర్ధమైందని పవన్ అన్నారు.