తిరుమల లడ్డూ కల్తీపై క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు పవన్‌కు స్వాగతం పలికారు. తర్వాత ఆలయం వద్ద మెట్లను ఆయన శుభ్రం చేశారు.
తిరుమల లడ్డూ అపవిత్రమైందన్న వార్తల మధ్య.. మొదట్లోనే తప్పును గుర్తించలేకపోయాను క్షమించు స్వామీ అంటూ పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష విరమిస్తారు. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.