హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలంగాణ వరద బాధితుల సహాయార్థం రూ.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చెక్కును బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని (Tejaswini Nandamuri) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి అందజేశారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి, బాలకృష్ణ తరపున చెక్కును అందించారు. ఇదే తరహాలో, ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన రూ.50 లక్షల చెక్కును గురువారం బాలకృష్ణ చంద్రబాబుకు (Chandrababu Naidu) అందజేశారు.
గత రెండు వారాల కిందట కురిసిన భారీ వర్షాల వల్ల తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ వంటి ప్రాంతాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి. ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకోవడానికి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా సహాయం చేశారు. ఈ క్రమంలో, బాలకృష్ణ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ.50 లక్షలు, మొత్తం రూ.కోటి విరాళం ప్రకటించారు.