‘కమిటీ కుర్రోళ్లు’ OTTలో సందడి చేసేందుకు సిద్ధం!
యువ నటీనటులతో కొత్త దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు ఆగస్టు 9న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించి, అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న ఈ సినిమా, త్వరలోనే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. “ఈ 11 మంది కొత్త కమిటీ కుర్రోళ్లు సెప్టెంబర్‌లోనే రాబోతున్నారు. మన కమిటీ కుర్రోళ్లు బయల్దేరిపోయారు” అంటూ క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే, సినిమా స్ట్రీమింగ్ ప్రారంభ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. వినాయక చవితిని పురస్కరించుకుని, సెప్టెంబర్ తొలి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ హౌస్ బ్యానర్‌పై మెగా డాటర్ నిహారికా కొనిదెల నిర్మించారు.
కథ సారాంశం:
గోదావరి జిల్లాలో ఉన్న పురుషోత్తంపల్లి అనే పల్లెటూరులో భరింకాళమ్మతల్లి జాతర పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఉత్సవానికి, ఇందులో జరిగే బలి చేటకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. జాతర పూర్తవగానే ఊరి సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంటాయి. ప్రస్తుత సర్పంచ్ బుజ్జి (సాయికుమార్)కి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు శివ (సందీప్ సరోజ్) అనే యువకుడు ముందుకు వస్తాడు. గత జాతరలో జరిగిన గొడవల వల్ల ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం ప్రారంభించకూడదని పంచాయితీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయం తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? ఈసారి జాతర ఎలా జరిగింది? పన్నెండేళ్ల క్రితం కులాల గొడవ కారణంగా విడిపోయిన శివ మిత్ర బృందం తిరిగి ఎలా ఒక్కటైంది? చివరికి ఊరి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అన్నదే మిగతా కథ.
ఈ వినోదభరితమైన చిత్రం త్వరలో మీకు ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.
Tags: