మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’ (Devara) భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు, ఇది విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టిస్తోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్‌లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ క్రేజ్‌కు తగ్గట్టు యుఎస్‌లో ప్రీ సేల్స్ కూడా ఊహించని రీతిలో జరుగుతున్నాయి.
ప్రత్యంగిర సినిమాస్ సంస్థ యుఎస్‌లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రీ బుకింగ్స్ ప్రారంభించిన క్షణం నుంచే సినిమాపై ఉండే ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రీ సేల్స్ ఇప్పటికే 5 లక్షల డాలర్లను దాటడంతో, ఈ ఊపు మరింతగా పెరుగుతుందనిపిస్తోంది.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించడం ఖాయం అని సినీ పరిశ్రమలో అంచనా వేస్తున్నారు.
మేకర్స్ కూడా త్వరలో విడుదల కాబోయే థియేట్రికల్ ట్రైలర్ ఈ అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందనే నమ్మకంలో ఉన్నారు. ఈ అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ సెప్టెంబర్ 27, 2024న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ కూడా భైరా అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. NTR ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు.