మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా చిరుకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ కూడా మెగాస్టార్‌కు ఆనందంలో విషెష్ తెలుపుతున్నారు. నెట్టింట వరుస పోస్టులు పెడుతూ.. చిరంజీవిని కొనియాడుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికన ఇలా రాసుకొచ్చారు. ‘నేను డిగ్రీ చదివేప్పుడు నా దగ్గర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక పుస్తకం ఉండేది. అందులో సినిమా సంబంధిత రికార్డ్స్ నేను ఎక్కువగా చూడలేదు.
ఏవైన అద్భుతమైన సెట్స్ వేసినప్పుడో, బాండ్ చిత్రాల వంటి వాటిల్లో బోట్ తో లాంగ్ జంప్స్ చేసినప్పుడో ఇలా కొన్ని రికార్డ్స్ గురించి చదివాను. అవి కూడా చాలా తక్కువలో తక్కవ. నాకు తెలిసి ఒక 5% మాత్రమే సినీ సంబంధిత రికార్డ్స్ ఉండొచ్చు. కానీ అన్నయ్యకు 143 చిత్రాలలో 537 పాటల్లో 24 వేల డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను ఇలాంటి అరుదైన రికార్డ్ గిన్నిస్ బుక్ లో నమోదు చేస్తూ పురస్కరించినందుకు చాలా గర్వంగా.. సంతోషంగా అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ అన్నయ్య’ అంటూ నాగబాబు తన సంతోషాన్ని పంచుకున్నారు. అలాగే ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన, రామ్ చరణ్, వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ నెట్టింట పోస్టులు పెట్టి.. చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పవన్ కల్యాణ్
అన్నయ్య చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకమన్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్స్‌తో అలరించిన నటుడిగా చిరంజీవి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ‘ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా’ అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుందని చెప్పారు. అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.