ఇండియన్-2’ చిత్రం, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, 1996లో వచ్చిన సూపర్ హిట్ ‘ఇండియన్’ సినిమాకి సీక్వెల్‌గా జూలై 12న భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే, సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. సినిమా పెద్దగా కలెక్షన్లు కూడా రాబట్టలేకపోవడంతో పాటుగా, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీనితో దర్శకుడు శంకర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోల్స్ జరిగాయి.
ఈ మధ్య, ‘ఇండియన్-2’ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పెట్ లవర్స్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ డైలాగులు పశు ప్రేమికుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన శైలిలో ఈ సినిమా గురించి ఒక పోస్టు పెట్టింది. ఆమె ఒక వీడియోను పంచుకుంటూ, ‘‘ఇండియన్ సినిమా ఫ్లాప్ అయినందుకు నాకు చాలా సంతోషం. ఇది డిజాస్టర్ కావాల్సిన సినిమా. ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారు? అసలు ఈ ఇడియట్ రైటర్స్‌కు ఏమైంది?” అని ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా, చేతులు జోడించి దండం పెట్టిన ఎమోజీని కూడా జత చేసింది.
రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చాలామంది నెటిజన్లు ఆమె పోస్ట్‌ను పంచుకుంటూ, ఆమె అభిప్రాయాలకు మద్దతు ఇస్తున్నారు.