అల్లు వారసుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై జనసేన నేతలు విరుచుకుపడుతున్నారు. ఒకరివెంట మరొకరు మీడియా ముందుకొచ్చి మాటలు తుళ్లుతున్నారు. అల్లు అర్జున్‌కి అసలు అభిమానులే లేరని, ఉన్నట్లు ఊహలో బతుకుతన్నారని జనసేన బొలిశెట్టి శ్రీనివాస్ ఎద్దేవ చేయగా.. తాజాగా గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు ఒకడుగు ముందుకేసి అల్లు అర్జున్ అసలు హీరోనే కాదని, ఒక కమెడియన్ అని వ్యాఖ్యానించాడు. అల్లు అర్జున్‌ని విమర్శించడానికే మీడియా సమావేశం ఏర్పాటుచేసిన గన్నవరం నియోజకవర్గ ఇంచార్జి రమేష్ బాబు నోటికొచ్చినట్లు మాట్లాడారు. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా? కమెడియన్ మాత్రమే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని నీవు సినిమాల్లోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు అంటూ విరుచుకు పడ్డారు. చిరంజీవి మహావృక్షం “చిరంజీవి అనే వ్యక్తి సినీ ఇండస్ట్రీలో మహావృక్షం లాంటివాడు. ఎన్నో సంఘ సేవలు, బ్లడ్ బ్యాంక్ నిర్వహణల ద్వారా ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు. నువ్వు నీడ నిచ్చిన చెట్టునే విమర్శిస్తున్నావు. నీవు, నీ బాబు అల్లు అరవింద్ ఎవరికీ ఉపకారం చేయనివారు. ఏనాడూ పిల్లికి కూడా బిక్షం పెట్టనివారు. మీ స్థాయి ఏమిటో, నువ్వేమిటో ముందు చూసుకో. నువ్వు తొందరలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు..” అని చలమల శెట్టి రమేష్ బాబు మాట్లాడారు.
నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తా..!
అంతేకాదు, ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కానున్న పుష్ప సీక్వెల్ పుష్ప-2 సినిమా గన్నవరం నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తానని రమేష్ బాబు హెచ్చరించాడు. అల్లు అర్జున్ సినిమాలకు ఫ్లెక్సీలు కట్టే వాళ్ళు కూడా తమ నియోజక వర్గంలో ఎవరూ లేరని ఆయన వ్యాఖ్యానించాడు.