జానీ మాస్టర్ అరెస్ట్‌పై పోలీసుల అధికారిక ప్రకటన
తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్‌కు సంబంధించి హైదరాబాద్ పోలీసులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశామని, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
2020లో లైంగిక దాడి కేసు
2020లో తన అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ సమయంలో బాధితురాలు మైనర్ అని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు నేపథ్యంలో జానీ మాస్టర్‌పై పోక్సో (Protection of Children from Sexual Offences) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
జానీ మాస్టర్ గోవాలో అదుపులో
గత కొన్ని రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు గుర్తించారు. గోవా కోర్టులో ప్రవేశపెట్టి, ట్రాన్సిట్ వారెంట్ కింద జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నామని పోలీసులు ప్రకటించారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
లేడీ కొరియోగ్రాఫర్ స్టేట్మెంట్ రికార్డ్
ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, లేడీ కొరియోగ్రాఫర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జానీ మాస్టర్పై అత్యాచారం, దాడి ఆరోపణలతో పాటు పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.