తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులవుతూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేశ్ కుమార్, ఎన్‌ఎ్‌సయూఐ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, బీసీ నేతగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు.
టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను నియమించాలన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చింది. మహేశ్ కుమార్ గౌడ్, మధు యాష్కీ గౌడ్‌ల మధ్య ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, చివరికి మహేశ్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసింది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్ఠానం పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పలుమార్లు సమావేశమయ్యారు.
ఇటీవల ఈ ముగ్గురిని ఢిల్లీలోని అధిష్ఠానం పిలిచి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. బీసీ నేతల్లో వడపోతల తర్వాత మహేశ్ కుమార్ గౌడ్, మధు యాష్కీ గౌడ్‌ల పేర్లు తుది పరిశీలనకు వచ్చాయి. ప్రస్తుతం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్, సంస్థాగత అంశాలను చూసుకుంటున్నారు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది.
నిజామాబాద్ జిల్లా నుంచి
నిజామాబాద్ జిల్లాకు రెండోసారి పీసీసీ చీఫ్ పదవి దక్కింది. గతంలో పీసీసీ చీఫ్‌గా ధర్మపురి శ్రీనివాస్ సేవలు అందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పార్టీని అధికారంలోకి తెచ్చిన నేతగా ఆయన పేరుగాంచారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ చీఫ్ పదవి దక్కడం విశేషం.
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం రహత్ నగర్ గ్రామంలో 1966, మే 24న జన్మించిన మహేశ్ కుమార్ గౌడ్ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. 90వ దశకంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేపట్టారు. 1994లో డిచ్‌పల్లి, 2014లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా సేవలందించారు. పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు.
రేవంత్ రెడ్డి సేవలను కొనియాడిన అధిష్ఠానం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్రను ఏఐసీసీ అధిష్ఠానం కొనియాడింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా శక్తివంచన లేకుండా పనిచేశారని అభినందించింది.