యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి మరో సాలిడ్ హిట్ అందించిన ఈ సినిమా, ప్రతి పాత్రను అద్భుతంగా పండించడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి మహానటులు ప్రత్యేక పాత్రల్లో నటించి మంత్ర ముగ్దులను చేశారు. అందులో అమితాబ్ బచ్చన్ ఏడడుగుల అశ్వత్థామ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు. ద్వాపర యుగం నాటి ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ పూర్తిగా ఒదిగిపోయారు. ఆయన్ని ఆ పాత్రలో చూడడం ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభవం కలిగించింది.
అశ్వత్థామ పాత్రలో అమితాబ్ 7 అడుగుల ఎత్తులో కనిపించడంతో, చాలామంది గ్రాఫిక్ మాయాజాలం అనుకున్నారు. కానీ వాస్తవం వేరే. నిజంగానే 7 అడుగులు 7 అంగుళాల ఎత్తున్న జమ్మూ కశ్మీర్ కు చెందిన సునీల్ కుమార్ అనే ఆర్టిస్ట్ అమితాబ్ కు డూప్‌గా నటించారు.
సునీల్ కుమార్ జమ్మూలో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, సినిమాలపై ఉన్న ఆసక్తితో నటనలో అదృష్టం పరీక్షించుకున్నారు. కల్కి 2898 AD తోపాటు పలు హిందీ సినిమాల్లో కూడా ఆయనకు అవకాశాలు వచ్చాయి. ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్త్రీ 2 లో సునీల్ దెయ్యం పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
ఇటీవల సునీల్ కుమార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ కల్కి 2898 AD సినిమా అనుభవాలను పంచుకున్నారు.
“చిన్నప్పటి నుండి నేను అమితాబ్ సర్ అభిమానిని. నా కుటుంబం మొత్తం ఆయన అభిమానులే. అలాంటి అమితాబ్ సర్‌కి డూప్‌గా నటించాలని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. కల్కి సెట్స్‌లో మొదటి రోజు అడుగు పెట్టినప్పుడు ప్రభాస్ గారు, అమితాబ్ గారు కలిసి కూర్చుని నన్ను స్వాగతించారు. ఆ రోజు నేను ఎప్పటికీ మరచిపోలేను. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల్లో కూడా నేను పాల్గొన్నాను, ఇది నాకు గొప్ప అనుభవం” అని సునీల్ తెలిపారు.
సినిమా షూటింగ్ కోసం ముంబై, హైదరాబాద్‌ల మధ్య తిరగడం సునీల్‌కి కష్టంగా అనిపించినా, నటనపై ఉన్న ప్రేమతో ఆ కష్టాలను భరించానని పేర్కొన్నారు.