నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న విషయం సినీ వర్గాల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలను కలిగిస్తోంది. బాలయ్య క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆయన తనయుడు తొలి సినిమా అనేది ముందే సెన్సేషన్‌గా మారింది. ఈ ఎంట్రీ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా, అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా, ‘హనుమాన్’ సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అవ్వబోయే సినిమాకు డైరెక్షన్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ సినిమా నుంచి మరో కీలక అప్‌డేట్ తాజాగా బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. ఆయన కుమార్తె తేజస్వినీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ వార్తను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అక్టోబరులో సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక మోక్షజ్ఞ గురించి మాట్లాడుతూ, బాలయ్య మరో ఆసక్తికర విషయాన్ని చెప్పారు. “మోక్షజ్ఞ ఎప్పుడూ క్లాస్‌లో టాపర్. అతడు అమెరికాలో బీబీఎమ్ చదివి వచ్చినా, సినిమాలపై ఆసక్తి చూపిస్తాడు. పాత సినిమాలు చూడటం, వాటి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. సినిమాల్లో నటించాలనే ఆసక్తి అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను కూడా అతనిని ఈ ఫీల్డ్‌లోకి వచ్చేందుకు ప్రోత్సహిస్తున్నాను. త్వరలోనే అతని ఎంట్రీ గురించి ప్రకటిస్తాను” అని బాలయ్య పేర్కొన్నారు.