ఎన్టీఆర్ బామ్మర్దిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన నార్నే నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి సినిమా మ్యాడ్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో నార్నె నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు.
గత ఏడాది చిన్న సినిమా గా విడుదలైన మ్యాడ్ భారీ విజయాన్ని సాధించి, మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ విజయంతో సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ తో మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై వస్తుంది.
తాజాగా ఈ రోజు మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ముగ్గురు పంచెకట్టులో మెరిసి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ లుక్ కి మ్యాడ్ మూవీకి ఎలాంటి సంబంధం లేకుండా, కొత్తగా ఉంది. ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో వేచి చూడాలి. అదనంగా, ఈ మూవీ మొదటి పాటను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు.